AP Politics: ప్రజాస్వామ్య విలువలకు పెనుముప్పుగా మారుతున్న ఏపీ కక్షపూరిత రాజకీయాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. అధికార కూటమి (Alliance Government) , వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీ మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇది సాధారణ రాజకీయ పోటీలను మించి , వ్యక్తిగత కక్షలుగా మారుతోంది. ఇది రాష్ట్ర భవిష్యత్తు పై రాబోయే రోజులలో దారుణమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. కొన్ని వర్గాలు ఇది అసలు మంచిదికాదని స్పష్టంగా చెబుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేయడం, అధికారాన్ని వాడుకుని ప్రత్యర్థుల పై ఒత్తిడి తేవడం రాజకీయాల్లో ప్రమాదకర పరిస్థితుల దారి తీస్తుంది.
ఇటీవల వైసీపీ (YCP) అధినేత జగన్ (Jagan) చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తీసుకున్న గట్టి స్థానం అందరికీ స్పష్టంగా అర్థమైంది. “ఎక్కడున్నా వదిలిపెట్టం” అనే ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉన్నామని చెబుతూనే, ప్రత్యర్థులపై దాడులకు తెగబడడం, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆందోళనను పెంచుతోంది.
ఇక అధికారంలో ఉన్న కూటమి, అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీపై దాడులు పెంచింది. దాదాపు ప్రతి రోజు ఏదో ఒక కేసుతో వైసీపీ నేతలను ఇబ్బందులలోకి నెట్టడాన్ని పరిశీలకులు గమనిస్తున్నారు. ఇది పార్టీకి అనుభవం ఉన్న నేతలకి అంతగా ఇబ్బందికరంగా అనిపించకపోయినా, కొత్త నేతలు మాత్రం భయంతో వెనక్కి తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో పార్టీ కార్యకలాపాలు కూడా దెబ్బతింటున్నాయి.
ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో ఉండటం సహజమే అయినా, అవి పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువల కింద జరిగితేనే మంచిది. లేకపోతే, అవి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారే ప్రమాదం ఉంది. ప్రజలు ఎప్పుడూ పరిస్థితులను గమనిస్తూ ఉంటారు. ఒకే కూటమిగా ఉన్నా, ఒంటరిగానే పోటీ చేసినా ..గెలిచిన పార్టీలు ఉన్నాయి. అయితే ఈరోజు కుదిరిన అవకాశాన్ని కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటే, రేపటి రోజున అదే బూమరాంగ్ అవుతుందన్న అనుభవం కూడా మన రాజకీయ చరిత్రలో ఉంది.ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ తలదించుకునే స్థితి తలెత్తకముందే, రాజకీయాలలో సంయమనం, సహకారం అవసరం అని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆలోచించి అడుగు వేయకపోతే రాష్ట్రానికి పెద్ద ముప్పే వచ్చే అవకాశం ఉంది. మరి రాజకీయాలలో అపారమైన అనుభవం ఉన్న మన నేతలు ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి..