Anil Kumar Yadav: అనిల్ కుమార్ యాదవ్ రీ ఎంట్రీ.. నెల్లూరు లో వైసీపీ భారీ స్కెచ్..

నెల్లూరు జిల్లా (Nellore district) రాజకీయాల గురించి ప్రస్తావిస్తే మొదట గుర్తుకు వచ్చే పేరు అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav). ఆయన వైసీపీ (YSRCP )కి కచ్చితమైన ఫైర్ బ్రాండ్ లీడర్. ఒకప్పుడు జగన్ (Jagan ) అత్యంత నమ్మకస్తులలో ఒకరిగా పరిగణించబడ్డ ఆయన, మూడు సంవత్సరాలపాటు జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లా రాజకీయాల్లో ఆయనకే ఓ రేంజ్ ఉండేది. పార్టీలో ఆయనకే ప్రాధాన్యం ఉండేది. అనిల్ చెబితే చాలు అన్న స్థాయికి ఆయన ఎదిగారు.
అయితే ఆయన ప్రాధాన్యం పెరిగే కొద్దీ, పార్టీలో కొంత మందికి అసంతృప్తి మొదలైంది. అనిల్ మాట్లాడే తీరు, వ్యవహార శైలి కారణంగా చాలా మంది కీలక నాయకులు వైసీపీకి దూరమయ్యారనే మాటలు వినిపించాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వంటి నేతలు కూడా పార్టీని వదిలేయడానికి కారణం అనిల్ అని కొందరు అంటున్నారు. ఇక ఇటీవల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమితో అనిల్ లో దూకుడు తగ్గిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆయన రాజకీయాల నుంచి కొంత తాత్కాలికంగా తప్పుకున్నట్టు, చెన్నై (Chennai)లో ఉండి వ్యాపారాల్లో బిజీగా ఉన్నట్టు ప్రచారం జరిగింది.
అయితే ఈ మధ్య అనిల్ తిరిగి తాడేపల్లిలో (Tadepalli) జగన్‌తో కలిసి కనిపించడం, ఆయనను కలవడం, తదనంతరం పీఏసీలో (PAC) మెంబర్‌గా కీలక స్థానం దక్కించుకోవడం చూస్తే, ఆయన మళ్లీ రాజకీయంగా చురుగ్గా వ్యవహరించబోతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. దానికి కొనసాగింపుగా, ఆయన ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరులో మైనింగ్ రంగం తలకిందులవడానికి వేమిరెడ్డే కారణమన్నారు. అనుమతులు సరిగ్గా ఇవ్వకుండా, కేవలం తనవారికే దక్కేలా చూస్తూ మిగతా వ్యాపారులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. మైనింగ్ ఆగిపోవడంతో వేలాది మంది ఉపాధిని కోల్పోయారని, జిల్లాకు రావాల్సిన ఆదాయంలో వందల కోట్ల నష్టమయ్యిందని వ్యాఖ్యానించారు. వేమిరెడ్డికి సంబంధించిన వ్యక్తులే ప్రస్తుతం మైనింగ్ చేస్తూ లాభాలు పొందుతున్నారని కూడా విమర్శలు చేశారు.
అనిల్ ఈ వ్యాఖ్యలతో తన రాజకీయ ప్రయాణం ఇంకా ముగియలేదని, విపక్షంలోనూ తన స్టైల్లో ముందుకు సాగుతానని సిగ్నల్ ఇచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. వేమిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వస్తారనే ఊహనలకు బ్రేక్ వేసేలా, ఆయనపై విమర్శలతో వారిని దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే మాట్లాడినట్టు కనిపిస్తోంది. మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ తన రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టే ఉంది. ప్రస్తుతం నెల్లూరులో తన పట్టు కోల్పోతున్న వైసీపీకి అనిల్ ఎంట్రీ ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి.