ED : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. స్పీడ్ పెంచిన ఈడీ
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న భారీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచడం, కీలక నేతలకు వరుసగా నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దు చేసి, ప్రభుత్వమే స్వయంగా మద్యం విక్రయాలు చేపట్టింది. ఈ క్రమంలో మద్యం కొనుగోలు, సరఫరా, అమ్మకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ.
ముఖ్యంగా మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు నిలిపేశారు. కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు జరపడం ద్వారా వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని విమర్శలు వచ్చాయి. పేరున్న బ్రాండ్లను కాదని, గుర్తు తెలియని కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చి, నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు రాజకీయ నేతలు, కంపెనీ యజమానులు సిండికేట్‌గా ఏర్పడి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిట్ (SIT) విచారణకు ఆదేశించింది.
సిట్ దర్యాప్తులో ఈ లావాదేవీలు కేవలం రాష్ట్ర పరిధికే పరిమితం కాలేదని, దీని వెనుక భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగిందని ఆధారాలు లభించాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లాయి? మద్యం డిస్టిలరీల నుంచి ముడుపులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో మద్యం కంపెనీల ప్రతినిధులు, కొందరు మధ్యవర్తులను విచారించిన ఈడీ, తాజాగా కీలక రాజకీయ నేతల వైపు దృష్టి సారించింది.
వైసీపీలో అత్యంత కీలక నేతగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడిగా మిధున్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, మద్యం పాలసీ రూపకల్పనలో లేదా కొన్ని మద్యం సరఫరా సంస్థలకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదును కొన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించడంలో మిధున్ రెడ్డికి సంబంధం ఉందనే కోణంలో ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయసాయి రెడ్డికి నోటీసులు అందిన నేపథ్యంలో, వీరిద్దరి మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలు లేదా ఉమ్మడి వ్యాపార భాగస్వామ్యాల ద్వారా ఈ స్కామ్ నిధులు సర్దుబాటు అయ్యాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈడీ వరుసగా నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. తాజాగా.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఈ నెల 23ని రావాలని కోరింది. ఈ విచారణలో ప్రధానంగా “క్విడ్ ప్రో కో” జరిగిందా అనే దానిపై ఈడీ ఆరా తీయనుంది. మద్యం కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నందుకు గాను ప్రతిఫలంగా సదరు నేతలకు ఎంత ముట్టింది? ఆ సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెట్టారు? అనే అంశాలపై విచారణ కేంద్రీకృతం కానుంది.
ప్రభుత్వ మార్పు తర్వాత పాత ప్రభుత్వంలోని కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు ఈడీ విచారణ ఎదుర్కోవడం ఏపీలో ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ దీనిని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తుండగా, ప్రజల సొమ్మును దోచుకున్న వారు చట్టానికి దొరికి తీరాల్సిందేనని అధికార కూటమి నేతలు వాదిస్తున్నారు. మిధున్ రెడ్డి, విజయసాయి రెడ్డి విచారణ తర్వాత ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది? అనేది వేచి చూడాలి.






