KCR: ఆసుపత్రిలో చేరిన కేసీఆర్.. ఆయనకు ఏమైంది..?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) మరోసారి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో (Yasodha Hospital) చేరారు. గురువారం సాయంత్రం ఆయన నీరసం, జ్వరంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్‌కు హై బ్లడ్ షుగర్, తక్కువ సోడియం లెవల్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. షుగర్, సోడియం స్థాయిలను నియంత్రించేందుకు మందులు ఇస్తున్నట్లు యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రెండ్రోజులపాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్టు ప్రకటించారు.
కేసీఆర్ ఆరోగ్యం గత కొంతకాలంగా తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. 2023 డిసెంబర్‌లో ఆయన తన నివాసంలో జారిపడి ఎడమ తుంటి ఎముక విరిగింది. దీంతో యశోదా ఆసుపత్రిలో టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్నారు. ఆ సమయంలో 6-8 వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించగా, ఆయన కోలుకుని డిసెంబర్ 2023 చివరిలో డిశ్చార్జ్ అయ్యారు. 2023 సెప్టెంబర్‌లో కూడా కేసీఆర్ వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడ్డారు. అప్పట్లో ఆయన ప్రగతి భవన్‌లోనే ఉంటూ యశోదా వైద్యుల బృందం ఆధ్వర్యంలో చికిత్స పొందారు.
ఇప్పుడు మరోసారి కేసీఆర్ ఆనారోగ్యానికి గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గురువారం సాయంత్రం ఆయన బలహీనంగా కనిపించి, సరిగ్గా నడవలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనతో పాటు భార్య శోభా రావు, కుమారుడు కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఆయన్ను పరామర్శించారు.
కేసీఆర్ అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, ఉత్తమ చికిత్స అందించాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.