Indo Pak War: భారత్ పై పాక్ తప్పుడు ప్రచారం.. గట్టిగా బదులిస్తున్న సైన్యం

పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) నిరంతర దాడులతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. పాక్ సైన్యం భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్ మ్యూనిషన్, ఫైటర్ జెట్లతో దాడులు చేస్తోంది. దీనికి భారత్ గట్టిగా బదులిస్తోంది. పాకిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని రక్షణ ప్రతినిధి కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofia Qhureshi) వెల్లడించారు. ఈ ఘర్షణలపై భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు సంయుక్తంగా వివరాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikran Misri), కర్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Vyomika Singh) పాల్గొన్నారు.
పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దుల్లో వరుస దాడులకు పాల్పడుతోందని కర్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. ఉధంపుర్, భుజ్, పఠాన్‌కోట్, భటిండా వాయుసేన స్థావరాలతో పాటు శ్రీనగర్, అవంతిపుర, ఉధంపుర్‌లోని వైద్య కేంద్రాలపై పాక్ దాడులు చేసిందన్నారు. తెల్లవారుజామున 1:40 గంటల సమయంలో పంజాబ్‌లోని వాయుసేన స్థావరాలపై హైస్పీడ్ మిసైళ్లతో దాడులు జరిగాయని, ఇవి రెచ్చగొట్టే చర్యలని ఆమె స్పష్టం చేశారు. పాక్ ఆయుధాలు 26 చోట్ల భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చి సైనిక పరికరాలను దెబ్బతీశాయన్నారు. వీటిలో పలువురు సిబ్బంది గాయపడినట్లు ఆమె తెలిపారు. ఈ దాడుల్లో టర్కీ నుంచి సేకరించిన డ్రోన్లను పాకిస్థాన్ వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు. భారత సైన్యం ఈ డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేసిందని సోఫియా ఖురేషీ చెప్పారు. అయినప్పటికీ, పాక్ సైన్యం కుప్వారా, పూంఛ్, అఖ్నూర్ సెక్టార్లలో వరుసగా కాల్పులకు పాల్పడుతూ, సరిహద్దు ఉద్రిక్తతలను పెంచుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పాక్ దాడులకు భారత్ దీటుగా స్పందిస్తోంది. భారత సైన్యం పాకిస్థాన్‌లోని రఫీకీ, మురిద్, చక్లాల, రహిమ్ యార్ ఖాన్, సుక్కుర్, చునియాన్ వంటి సైనిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. ఫైటర్ జెట్లు, లక్ష్యాలను ఛేదించే ఆయుధాలతో పస్రూర్‌లోని రాడార్ కేంద్రం, సియాల్‌కోట్‌లోని ఏవియేషన్ బేస్‌ను ధ్వంసం చేసినట్లు సోఫియా ఖురేషీ తెలిపారు. ఈ దాడుల్లో పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అంతర్జాతీయ మీడియాకు ఈ వివరాలను ఆంగ్లంలో వెల్లడించారు. భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని నిరూపించేందుకు టైమ్‌స్టాంప్‌తో కూడిన వీడియోలు, ఫొటోలను ప్రదర్శించారు.
మరోవైపు భారత్ పై పాకిస్తాన్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆవేదన వ్యక్తం చేశారు. శిర్సా, సూరత్‌ఘర్ వైమానిక స్థావరాలు, ఆదంపుర్‌లోని ఎస్-400, బ్రహ్మోస్ మిసైల్ డిపోలను ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. పాక్ దాడులకు భారత్ దీటుగా స్పందిస్తున్నప్పటికీ, సరిహద్దులో పాక్ సైన్యం కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత సైన్యం అప్రమత్తంగా ఉంటూ దేశ భద్రతను కాపాడేందుకు సన్నద్ధంగా ఉంది.