CM Revanth Reddy : సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారా..?

హీరో అల్లు అర్జున్ (Allu Arjun Arrest) అరెస్ట్ వ్యవహారం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సినిమా థియేటర్ లో తొక్కిసలాట జరిగి ఒకరు మరణిస్తే దానికి హీరో బాధ్యుడవుతారా..? అంతటి హీరోను అరెస్టు చేస్తారా..? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగితే ఎంతమందిని అరెస్టు చేశారని కూడా సోషల్ మీడియాలో పలువురు నిలదీస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాత్రం అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారాన్ని సమర్థించుకున్నారు. హీరోలకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఉండదన్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ చూసిన వాళ్లు చాలా మంది ఆశ్చర్యపోయారు. పరిధి దాటి మాట్లాడారని అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం శుక్రవారం దేశమంతా కుదిపేసింది. రీజనల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ఈ వ్వవహారాన్ని రోజంతా కవర్ చేసింది. గంటల వ్యవధిలోనే అరెస్టు నుంచి బెయిల్ వరకూ అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బెయిల్ వచ్చినా డాక్యుమెంట్స్ రాకపోవడంతో ఆయన రాత్రి జైలులోనే గడపాల్సి వచ్చింది. చివరకు శనివారం ఉదయం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్లి పరామర్శిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా కేసు కోర్టులో ఉన్నందున తాను మాట్లాడనని.. పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కాస్త ఘాటుగానే స్పందించారు. అరెస్టు తతంగం జరుగుతున్న సమయంలో ఢిల్లీలో ఆజ్ తక్ టీవీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అందులోనే అరెస్టుపై ఆయన రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ థియేటర్ వద్ద కారెక్కి చేతులూపుతూ హంగామా చేయడం వల్లే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందన్నారు. అందుకే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు రేవంత్ రెడ్డి. శాంతిభద్రతల పోర్టుపోలియో తన వద్దే ఉందన్న ఆయన..ఈ కేసు వివరాలన్నీ తనకు తెలుసన్నారు. సినిమా స్టార్ అయినంత మాత్రాన అరెస్టు చేయొద్దా అని ప్రశ్నించారు. సినిమాలు తీశారు.. డబ్బు సంపాదించుకున్నారు.. వాళ్లది వ్యాపారం.. అందరితో పాటు అల్లు అర్జున్ కూడా.. అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హీరో అయినంత మాత్రాన స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదని తేల్చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. పుష్ప 2 (Pushpa 2) సక్సెస్ మీట్ లో ఆ మధ్య అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తురాక తడబడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేటీఆర్ కూడా తెలంగాణ సీఎం ఎవరో సినిమా సెలబ్రిటీలకు కూడా తెలియట్లేదంటూ ఎద్దేవా చేశారు. బహుశా తెలంగాణ సీఎం తానేనని రుచి చూపించేందుకు అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్టు చేశారేమోనని సోషల్ మీడియాలో (Social Media) ప్రచారం జరుగుతోంది. దాన్ని పక్కన పెడితే సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఈ కేసులో అల్లు అర్జునే బాధ్యుడు అని జడ్జిమెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అలాంటప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఇలా స్పందించడం అంటే కేసును ప్రభావితం చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. దోషులెవరో తేల్చాల్సింది కోర్టులు. అంతేకానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జునే బాధ్యుడని చెప్పేశారు. ఇలా మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది. కోర్టు పరిధిలో ఉన్నందున తాను మాట్లాడబోనని చెప్పి ఉంటే సరిపోయేది.
సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ (Cinema Industry) విషయంలో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నట్టు అర్థమవుతోంది. హైడ్రా ద్వారా నాగార్జున ఎన్-కన్వెన్షన్ (Nagarjuna N-Convention) ను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha).. నాగార్జునపై చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి. అప్పుడు ఇండస్టరీ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెట్టింది. ఆ తర్వాత మోహన్ బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu) ఇష్యూలో కూడా పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పడు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. బహుశా గతంలో ఇండస్ట్రీ మొత్తం బీఆర్ఎస్ (BRS) కు కొమ్ముకాయడాన్ని రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకున్నారేమో అని కొందరు భావిస్తున్నారు. లేదంటే ఇండస్ట్రీని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారేమో అని కూడా కొందరు సందేహిస్తున్నారు.
అంతేకాదు.. వాళ్లు హీరోలు కాదని.. నాకు నేనే హీరో అని రేవంత్ రెడ్డి అన్నారు. తనకే ఫ్యాన్స్ ఉన్నారన్నారు. దీన్నిబట్టి సినిమా హీరోల పట్ల రేవంత్ రెడ్డికి సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వీటన్నిటినీ బట్టి చూస్తే సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి వ్యతిరేకం అనే భావన కలుగుతోంది. మరి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో.. దీని వెనుక వ్యూహమేంటో అంతుచిక్కడం లేదు. తాను స్ట్రిక్ట్ అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నానిపిస్తోంది. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలు కచ్చితంగా ఇబ్బందులు కలిగిస్తాయని రేవంత్ రెడ్డి తెలుసుకుంటే మంచిదని కొందరు సూచిస్తున్నారు.