ASBL NSL Infratech

దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్

దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్

నిందితులను అరెస్ట్ చేసి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలి. తనకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు. ఏపీ ప్రజలు త్వరలోనే టీడీపీ సర్కార్‌కు ముగింపు పలుకుతారు.  

విశాఖ జిల్లాలో దళిత మహిళపై టీడీపీ నేతల దుశ్శాసన పర్వం ఘటనకుగానూ సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో దళిత మహిళపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమడలో బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ అధికార టీడీపీ దాష్టీకాలపై నిప్పులు చెరిగారు.

‘టీడీపీ నేతలు విశాఖలో మానవత్వం మరిచిపోయి రాక్షసపర్వం ప్రదర్శించారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్‌ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా దళిత మహిళ తమకు జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. ప్రభుత్వం గతంలో వారికిచ్చిన భూమిని కాపాడుకునే యత్నం చేయగా.. దళిత మహిళ చీర, జాకెట్టు చించేలా టీడీపీ నేతలను ఉసిగొలిపే హీనస్థితికి చంద్రబాబు దిగజారారు. నిజంగా ఈ ఘటనతో సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. దళిత మహిళపై ఆ దాష్టీకానికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయించి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి కఠినచర్యలు తీసుకోవాల్సింది పోయి తనకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించడం కంటే దుర్మార్గమైన చర్య ఇంకేమైనా ఉంటుందా?. మహిళలపై ఇంత నీచానికి పాల్పడుతున్నా చర్యలు తీసుకోలేని చంద్రబాబు సర్కార్ పాలనకు ఏపీ ప్రజలు త్వరలోనే ముగింపు పలకాలంటూ’  వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. 

మరోవైపు ఈ ఘటనపై మంగళవారం బాధితులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెందుర్తి వైస్‌ ఎంపీపీ మడక పార్వతి, ఆమె భర్త, టీడీపీ నేత మడక అప్పలరాజు, మాజీ సర్పంచ్‌ వడిశల శ్రీను, టీడీపీ నాయకులు సాలాపు జోగారావు, రాపర్తి గంగమ్మ, మడక రాము నాయుడిపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. నిందితులంతా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు కావడంతో కేసు నమోదుకు పోలీసులు వెనుకాడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Tags :