ఆంధ్రాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం..
ఆంధ్రా ఈరోజు పోలింగ్ ఎంతో శాంతియుతంగా జరపడానికి.. జీరో వయొలెన్స్ తో ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న అన్ని చర్యలు విఫలమయ్యాయి. కొన్నిచోట్ల పోలింగ్ రోజు తలలు పగిలాయి, తోపులాటలు గొడవలు గా మారాయి. అయితే విచిత్రం ఏమిటంటే.. ఎవరికివారు తామే బాధితులం అంటూ.. ప్రత్యర్థి పార్టీ తమపై దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రాలో పలు పోలింగ్ సెంటర్లలో టీడీపీ ఏజెంట్ల పై దాడులు జరిగాయని.. కిడ్నాప్ లు కూడా చేయడానికి ప్రయత్నించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో, పల్నాడు జిల్లా రెంట చింతల మండలంలో కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎల్లో మీడియా ప్రకాశం జిల్లా కొండపిలో, సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కూడా దాడులు జరిగినట్టు కథనాలను హైలైట్ చేస్తోంది. ఇటు వైసిపి కూడా పలు చోట్ల తమ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. చిత్తూరులో తమ ఏజెంట్ పై టీడీపీ దాడి చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. దర్శిలో ఓటు వేయడానికి క్యూలో నిలబడిన వైసీపీ అభిమాని పై టీడీపీ నేతలు దాడి చేశారని.. ఆ వ్యక్తికి రక్తగాయాలయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనలకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.