ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యే 3 వేల ఓట్లు డిలీట్ చేశారు: కిషన్ రెడ్డి
షేక్‌పేట నియోజకవర్గంలో 3 వేల ఓట్లును డిలీట్ చేశారని, ఒక వర్గానికి చెందిన ఓట్లను మాత్రమే డిలీట్ చేయడం దుర్మార్గమని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో భాగమైన షేక్‌పేటలో 3 వేల ఓట్ల వరకు గల్లంతైనట్లు కిషన్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఆయన.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజవర్గంలో కొంతమంది అధికారులు పథకం ప్రకారమే ఓ వర్గానికి చెందిన వారి ఓట్లనే డిలీట్ చేశారంటూ ఆరోపించారు. ఓట్లు డిలీటైన వారంతా ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని, ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, వారిలో అనేకమందికి ఈ ప్రాంతంలో సొంత ఇళ్లు కూడా ఉన్నాయని, కొందరు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారని అన్నారు.
ఎలాంటి కారణం లేకుండానే ఓటింగ్ లిస్ట్ నుంచి 3 వేల మందికి పైగా పేర్లు తొలగించారని, అధికారుల్లో ఎవరో కావాలనే ఇలా చేశారని, ఓ వర్గంతో కుమ్మక్కయి ఇలా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి, సికింద్రాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, వారు దర్యాప్తు చేపడతామని హమీ ఇచ్చారని కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే తాము ఇక్కడితో ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదని, ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు