Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు.. కొత్త బిల్లుతో చెక్!?

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ (betting apps) దేశవ్యాప్తంగా యువతను, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక, మానసిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ యాప్స్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో లక్షలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్, 2025’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే, బెట్టింగ్ యాప్స్‌పై కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ (online betting) యాప్స్ దేశంలో గత కొన్నేళ్లుగా విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఫాంటసీ క్రీడలు, పోకర్, రమ్మీ, ఆన్‌లైన్ లాటరీలు వంటి ఆటలు యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ యాప్స్‌ను సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయడం వల్ల యువత ఈ యాప్స్ వైపు మరింత ఆకర్షితమవుతోంది. ఒక్క తెలంగాణలోనే గత రెండేళ్లలో 1,023 మందికి పైగా బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఈ యాప్స్ ద్వారా జరిగే మోసాలు, డేటా దోపిడీ, పన్ను ఎగవేత వంటి సమస్యలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ యాప్స్ వల్ల భారీగా నష్టపోతున్నారు. కొందరు లక్షల రూపాయలు అప్పులు చేసి, తమ ఆస్తులను కోల్పోతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి.
బెట్టింగ్ యాప్స్ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయని, కోట్లాది మంది జీవితాలు నాశనమవుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వీటికి చెక్ పెట్టేలా కొత్త బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఈ నెల 20న ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి బిల్లులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
డబ్బు లావాదేవీలతో నడిచే ఆన్‌లైన్ గేమ్స్‌పై పూర్తి నిషేధం విధించారు. ఇందులో ఫాంటసీ క్రీడలు, పోకర్, రమ్మీ, ఆన్‌లైన్ లాటరీలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై జైలు శిక్ష, జరిమానాలు విధించేలా నిబంధనలు రూపొందించారు. గేమింగ్ సంబంధిత నిధుల లావాదేవీలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రాసెస్ చేయకుండా నిషేధం విధించారు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడే వారిని శిక్షల నుంచి మినహాయించి, వారిని బాధితులుగా పరిగణిస్తారు. పీఎంఎల్‌ఏ ద్వారా అక్రమ బెట్టింగ్ సైట్లను బ్లాక్ చేసే అధికారాన్ని అధికారులకు కల్పిస్తుంది. నైపుణ్య ఆధారిత గేమ్స్ (skill based games)ను, అదృష్టం ఆధారిత గేమ్స్ (chance based games)ను వేరు చేసి, వినోద ఆధారిత ఆన్‌లైన్ గేమ్స్‌ను ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఈ-స్పోర్ట్స్, సామాజిక ఆటలను ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, బడ్జెట్‌తో పాటు ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా ఆన్‌లైన్ గేమింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. 2023 అక్టోబర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ విధించగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి గెలిచిన మొత్తంపై 30% పన్ను విధించారు. 2023లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంతో 20కి పైగా యాప్స్‌పై నిషేధం విధించారు. ఇటీవల 392 బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీలను ఫ్రీజ్ చేసి, రూ.122 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ యాప్స్‌పై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ, నోటీసులు జారీ చేసింది. ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల యువతను మానసిక, ఆర్థిక బానిసత్వం నుంచి కాపాడే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు.
ఈ బిల్లుపై గేమింగ్ రంగంలో ఉపాధి కల్పిస్తున్న సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ చట్టం లక్షలాది మంది ఉపాధిని నాశనం చేస్తుందని, ఈ-స్పోర్ట్స్ రంగం ప్రభావితమవుతుందని వారు వాదిస్తున్నారు. అయితే, కేంద్రం మాత్రం సామాజిక ఆటలను, ఈ-స్పోర్ట్స్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంది.