Maoist: సైద్ధాంతిక గందరగోళంలో మావోయిస్టులు.. పదవికి మల్లోజుల రాజీనామా..!

మావోయిస్టులు (Maoists) సైద్దాంతిక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారా..? కేంద్ర బలగాల నుంచి వరుసగా ఎదురవుతున్న ఎదురుదెబ్బలు… వారిని సిద్ధాంతం విషయంలో ఆలోచింప చేస్తున్నాయి. అవును.. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా మావోయిస్టు అగ్రనేతలు జగన్, మల్లోజుల మధ్య విబేధాలు పెరిగి.. ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరో పదవికి మల్లోజుల (mallojula venugopal) రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఈ పదవిలో కొనసాగే అర్హత తనకు లేదని భావించి పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.అంతేకాదు.. అనవసర త్యాగాలకు స్వస్తి పలకాలని సహచరుడు జగన్(jagan) కు, క్యాడర్ కు సూచించారు.
ఈ మేరకు పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఆయన ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ ఇప్పటివరకు అనుసరించిన పంథా పూర్తిగా తప్పని, దీనివల్ల ఉద్యమం తీవ్రంగా నష్టపోయిందని అంగీకరించారు. ఉద్యమాన్ని ఓటమి పాలుకాకుండా కాపాడలేకపోయినందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం ఒక టీకా లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయుధాలు వీడాలనే నిర్ణయంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జీవించి ఉన్నప్పుడే ఈ అంశంపై చర్చ జరిగిందని గుర్తుచేశారు. ఈ విషయంలో పార్టీ అధికార ప్రతినిధి జగన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఫాసిస్టు పరిస్థితుల్లో సాయుధ పోరాటం ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని స్పష్టం చేశారు. అనవసర త్యాగాలకు ఇకనైనా ముగింపు పలికి, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని క్యాడర్‌కు ఆయన సూచించారు.