Manoj Jarange: మరాఠా రిజర్వేషన్లపై తుదిపోరాటం.. ఛలో ముంబై అంటున్న మనోజ్ జారంగే…!
ఓబిసీ కేటగిరి కింద మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జారంగే (Manoj Jarange) మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆయన ‘ఛలో ముంబై’ (Chalo Mumbai) అంటూ పిలుపునిచ్చారు. మరాఠా రిజర్వేషన్లపై ఇదే తన చివరి పోరాటమని ప్రకటించారు. మహారాష్ట్రలోని మరాఠా ప్రజలంతా ఛలో ముంబై మార్చ్‌లో పాల్గొనాలని కోరారు.
తమ ఉద్యమం క్షేత్రస్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర రాజధానికి మళ్లించినట్టు చెప్పారు మనోజ్ జారంగే. తన స్వగ్రామమైన అంతర్వాలి సరాటి గ్రామం నుంచి ఆగస్టు 27న ఈ ప్రదర్శన మొదలవుతుందని తెలిపారు. ఆగస్టు 29న ముంబై చేరుకుంటామని, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజిర్వేషన్ డిమాండ్‌పై ఆజాద్ మైదానంలో నిరసన తెలుపుతామని అన్నారు. పెద్దఎత్తున మఠారీలు ఇందులో పాల్గొనాలని, హాజరు బలహీనంగా ఉంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోదని అన్నారు. ప్రదర్శన ముంబైకి చేరుకునే సరికి పోరాటం తీవ్రంగా ప్రారంభం కావాలని అన్నారు. ‘ఇదే మన చివరి పోరాటం. మరాఠా కోటా సాధించుకోకుండా వెనక్కి వచ్చేది లేదు’ అని పిలుపునిచ్చారు.
మరాఠా ప్రజలకు ఆటంకాలు కలిగించవద్దని, శాంతియుత ప్రదర్శనలపై పోలీసులను ఉసికొలపవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మనోజ్ జారంగే విజ్ఞప్తి చేశారు. ప్రదర్శకులను లక్ష్యంగా చేసుకునే బదులు ఇప్పటికీ విచారణలోనే ఉన్న మహదేవ్ ముండే హత్య వంటి క్రిమినల్ నేరాల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మరాఠా రిజర్వేషన్ కోసం జరుపుతున్న ఉద్యమంలో నిరసనకారులు క్రమశిక్షణ, అహింసను పాటించాలని కోరారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరూ పరుగులు పెట్టడం కానీ, హింసాత్మకంగా వ్యవహరించడం కానీ చేయవద్దన్నారు. రాళ్లు విసిరే పని మనం చేయమని, రాజకీయ కుట్రల్లో భాగంగా రాళ్లు రువ్వి రెచ్చగొట్టే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని సూచించారు.








