Amith Shah: జైలు కెళితే పీఎం అయినా.. సీఎం అయినా గద్దె దిగాల్సిందే.. ‘రాజ్యాంగ సవరణ’ పై విపక్షాలకు కేంద్రం క్లారిటీ

130వ రాజ్యాంగ సవరణ.. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. దీని ప్రకారం.. ‘‘ప్రధాని గానీ, ముఖ్యమంత్రి గానీ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే.. ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమతమ పదవులకు రాజీనామా చేయాలి. అలా చేయకపోతే.. చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణ ఉపకరిస్తుంది. ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్రమోడీనే దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగానీ, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా?’’ అని ప్రతిపక్షాలపై హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మండిపడ్డారు. ఈ బిల్లు కచ్చితంగా పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
‘‘విపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళ్తే సులభంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలమని అనుకుంటున్నారు. వారు జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సిద్ధాంతాలను నేను, మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు’’ అని అమిత్ షా అన్నారు.
130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా 2013 నాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. ‘‘రాజ్యాంగ సవరణ బిల్లులో నైతికత లేదని విపక్షాలు అంటున్నాయి. నాడు లాలూ యాదవ్‌ను కాపాడేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పత్రాలను రాహుల్ గాంధీ చింపేశారు. ఆ రోజే ఆయన నైతికతతో వ్యవహరిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రాజ్యాంగ సవరణపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. వరుస వైఫల్యాలతో ఆ పార్టీ ఆలోచనావిధానం మందగించి ఉంటుంది’’ అని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.
ధన్‌ఖడ్ రాజీనామా.. ఎక్కువగా లాగొద్దు
ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. ‘‘ధన్‌ఖడ్‌జీ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.