Operation Sindoor: సోఫియా, వ్యోమికా సిందూర తిలకం..!!

భారతదేశం శత్రువుకు గట్టి సమాధానం చెప్పింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ ‘ఆపరేషన్ సిందూర్’ను (Operation Sindoor) విజయవంతంగా నిర్వహించింది. పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా చేపట్టిన ఈ మెరుపు దాడులు భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. ఈ ఆపరేషన్ వివరాలను దేశ ప్రజలకు వెల్లడించేందుకు కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖలు ఒక ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించాయి. ఈ బ్రీఫింగ్‌లో రెండు పేర్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. వాళ్లే కల్నల్ సోఫియా ఖురేషి (Colonal Sofia Khureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh). ఈ ఇద్దరు వీరమహిళలు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రపంచానికి చాటి, భారత మహిళల నుదుటిపై వీరతిలకంలా నిలిచారు.
గుజరాత్‌కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి సాధారణ మహిళ కాదు. బయోకెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె, 1990లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ లో సీజన్డ్ ఆఫీసర్‌గా మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె రాజీలేని పోరాటం చేశారు. 2006లో ఐక్యరాష్ట్ర సమితి (UNO) శాంతి మిషన్‌లో భాగంగా కాంగోలో పీస్‌కీపర్‌గా విధులు నిర్వర్తించారు. 2016లో పుణెలో జరిగిన ‘ఎక్సర్‌సైజ్ 18’ అనే మల్టీ-నేషనల్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో 18 దేశాల బృందాల మధ్య భారత బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళా నాయకత్వం ఉండటం విశేషం. శాంతి పరిరక్షణ, మందుపాతర తొలగింపు వంటి క్లిష్టమైన కార్యకలాపాల్లో ఆమె నైపుణ్యం అందరినీ ఆకర్షించింది. ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్‌లో సోఫియా తన స్పష్టమైన వివరణ, ధైర్యసాహసాలతో దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఒక కలల సాధకురాలు. చిన్నతనం నుంచే పైలట్ కావాలన్న కలతో ఎదిగిన ఆమె, చదువుకునే రోజుల్లో ఎన్‌సీసీలో (NCC) చేరి అడుగు ముందుకు వేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత, భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా వృత్తిని ప్రారంభించారు. 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్‌ను సాధించారు. ఆమె కుటుంబంలో భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి కావడం విశేషం. జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతంలోని ఎత్తైన, సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపిన ఆమె, అనేక రెస్క్యూ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్‌లో వ్యోమికా సింగ్ తన నిపుణత, నమ్మకంతో దాడుల వివరాలను వెల్లడించి, భారత మహిళల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక కార్యక్రమం మాత్రమే కాదు. ఇది భారత మహిళల వీరత్వానికి, దేశభక్తికి చిహ్నం. ఈ ఆపరేషన్‌ను బ్రీఫింగ్ చేసిన సోఫియా, వ్యోమికా ద్వయం భారత సైన్యంలో మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో నిరూపించారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను కేవలం 25 నిమిషాల్లో ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్, భారత సైన్యం యొక్క వ్యూహాత్మక నైపుణ్యానికి అద్దం పట్టింది. ఈ బ్రీఫింగ్‌లో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి (Vikram Misri) కూడా పాల్గొనడం ఈ ఆపరేషన్‌కు రాజకీయ, వ్యూహాత్మక ప్రాధాన్యతను జోడించింది. ఈయన కాశ్మీరీ పండిట్. ఈ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళలను ముందుంచడం ద్వారా భారత్ ఒక బలమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది. భారత మహిళలు కేవలం ఇంటి గడప దాటడమే కాదు, శత్రువులకు సమాధానం చెప్పే సామర్థ్యం కూడా కలిగి ఉన్నారని నిరూపించింది.