UN: ఐక్యరాజ్యసమితిలో మళ్లీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్..

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఈ పరిణామాల వేళ ఐక్యరాజ్య సమితి (United Nations) భద్రతా మండలిలో కీలక సమావేశం జరిగింది. ఇందులో పాక్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. పహల్గాం ఉగ్రదాడిపై దృష్టి మరల్చేందుకు కశ్మీర్ అంశాన్ని వనెత్తింది.పాకిస్థాన్ అభ్యర్థన మేరకు సోమవారం ఐక్యసాజ్యసమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, పాక్ మాత్రం మరోసారి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసింది.
ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖర్ ఈ భేటీలో మాట్లాడుతూ.. భారత్‌పై మరోసారి అసత్యాలు వల్లె వేశారు. అంతర్జాతీయ వేదికపై న్యూఢిల్లీని దోషిగా నిలబెట్టేందుకు యత్నించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దాయాది ఆరోపణలకు భారత్ గట్టిగా బదులిచ్చినట్లు తెలుస్తోంది.
సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహమ్మది ఖిలారీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితి అస్థిరంగా ఉంది. ఈ ఘర్షణాత్మక సమస్యకు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్య దేశాలు పిలుపునిచ్చాయి’’ అని తెలిపారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని భద్రతా మండలి అధ్యక్షుడు ఎవాన్‌గెలోస్ సెక్రీస్ వెల్లడించారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్(guterrus) కీలక ప్రకటన చేశారు. ఉగ్రదాడి తర్వాత ప్రజల్లో భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనన్న ఆయన.. ఇందుకు సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. పొరపాట్లు చేయొద్దని, సంయమనం పాటించాలని ఇరుదేశాలకు విజ్ఞప్తి చేశారు.
వరుసగా 12వ రోజు పాక్ కవ్వింపులు..
మరోవైపు, భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. వరుసగా 12వ రోజు దాయాది సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, నౌషెరా, సుందర్‌బనీ, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులకు పాల్పడింది. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.