UN: భద్రతా మండలిలోనూ అట్టర్ ప్లాప్.. హత విథీ అనుకుంటున్న పాక్..

భద్రతా మండలి వేదికగా భారత్ ను ఇరుకున పెట్టాలని ప్లాన్ వేసిన పాకిస్తాన్.. తాను పన్నిన వ్యూహాంలో తానే చిక్కుకుని విలవిలలాడింది. భద్రతా మండలిలో భారత్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలన్న పాక్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి.అంతేకాదు.. పాకిస్తాన్ కే సభ్య దేశాల నుంచి చాలా కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా మారింది దాయాది పరిస్థితి.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై భద్రతా మండలిలో ఒక క్లోజ్డ్‌డోర్ సమావేశం జరిగింది. ఇప్పటికే ఇస్లామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సభ్య దేశాల్లో ఒకటి. ఆ దేశం అభ్యర్థన పైనే ఈ సమావేశం జరిగింది. తన సభ్యత్వాన్ని అడ్డంపెట్టుకొని భారత్ వ్యతిరేక తీర్మానం చేయాలని తొలుత భావించింది. కానీ, ఈ ప్రయత్నాలు బెడిసికొట్టి.. దానికే ఎదురు క్లాస్ తీసుకొన్నాయి. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో దానికి చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. పాక్ తరఫున ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధి అసీమ్ ఇఫ్తికార్ అహ్మద్ హాజరయ్యారు.
ఇస్లామాబాద్(Islamabad) బహిరంగ అణు బెదిరింపులపై చాలా సభ్యదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇటీవల పాక్ క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని ప్రశ్నించాయి. అది ఉద్రిక్తతలు పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందన్నాయి. అదే సమయంలో భారత్ కుట్రపన్ని పహల్గాం దాడి చేసుకొని(false flag operation) .. పాక్‌పై నిందలు మోపుతోందన్న వాదనలను కూడా సభ్యదేశాలు తిరస్కరించాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలని తేల్చిచెప్పాయి. పహల్గాం దాడిలో లష్కరే తోయిబా పాత్రను ప్రశ్నించాయి. అంతేకాదు.. ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకులను చంపడంపై ఆందోళన వ్యక్తంచేశాయి.
పాక్ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామనుకొన్నా.. ఏ దేశమూ దానితో చేయి కలపలేదు. దీంతో ఏ తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది. చివరికి చైనా కూడా సమావేశం తర్వాత ప్రెస్ స్టేట్‌మెంట్‌లో పాలుపంచుకోలేదు. భారత్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌కు చాలా దేశాలు సలహా ఇచ్చాయి.