Rome: 14వ పోప్‌గా రాబర్ట్ ప్రివోస్ట్- మొదటి సారిగా అమెరికా దేశం నుంచి ఎన్నిక

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లమంది కేథలిక్కులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. వారికి ఆరాధ్యుడైన పోప్ (Pope) ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ (Robert Prevost) ను తదుపరి పోప్‌గా ఎన్నుకున్నట్టు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. పోప్‌గా ఓ అమెరికన్ ఎన్నికకావడం ఇదే ప్రథమం. రాబర్ట్ ప్రివోస్ట్‌ను ఇకపై 14వ పోప్ లియోగా వ్యవహరిస్తారు. సంప్రదాయం ప్రకారం పోప్ లియో సెయింట్ పీటర్స్ కూడలిలోని బాల్కనీ నుంచి తన రాక కోసం ఎదురుచూస్తున్న వేలమంది క్యాథలిక్కులకు దీవెనలందించారు. ‘‘శాంతి మీ అందరినీ వెన్నంటి ఉండుగాక’’ అని ఆయన ఆశీర్వాద వచనాలు పలికారు. అంతకుముందు పోప్ ఎన్నిక పూర్తయిందనడానికి సూచికగా వాటికన్ నగరంలోని సిస్టిన్ చాపెల్ చర్చి పొగగొట్టం నుంచి తెల్లటి పొగ బయటకు వచ్చింది. దీంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయినట్టు ప్రపంచానికి సందేశం అందింది.
‘‘ఆర్డో రితూమ్ కాంక్లేవిస్’’ నిబంధనల ప్రకారం సంప్రదాయబద్ధంగా పోప్ ఎన్నిక పూర్తయిందని వాటికన్ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎన్నికైన పోప్‌ను కార్డినళ్లలో అందరికంటే వయసులో పెద్దవారైన మతగురువు ‘‘అత్యున్నత మతగురువుగా మీ ఎన్నికను అంగీకరిస్తున్నారా’’ అని ప్రశ్నించారు. ‘‘ఇకపై ఏ పేరుతో మిమ్మల్ని పిలవాలని కోరుకుంటారు’’ అని కూడా అడిగారు. కొత్తగా ఎన్నికైన పోప్ తన ఎన్నికను అంగీకరించడంతో 133 మంది కార్డినళ్ల సమావేశం ముగిసింది.
సిస్టిన్ చర్చి పొగగొట్టం నుంచి తెల్లటి పొగ రావడం చూసిన వేల మంది క్యాథలిక్కులు ‘‘వైవల్ ఇల్ పపా’’ (పోప్ వర్ధిల్లాలి) అంటూ నినాదాలు చేశారు. ఆనందంతో కేరింతలు కొడుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. 14వ పోప్‌గా రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నిక అమెరికాకు గర్వకారణమని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
పెరూ పౌరసత్వం
అమెరికాలోని షికాగోకు చెందిన ప్రివోస్ట్ అంతర్జాతీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఒక మతగురువుగా ఆయన సుదీర్ఘకాలం దక్షిణ అమెరికాలో పనిచేశారు. ఇటీవల బిషప్ నియామక బాధ్యతలు నిర్వహించారు. ప్రివోస్ట్ దాదాపు దశాబ్దకాలంపాటు పెరూలోని ట్రుజిల్లోలో పనిచేశారు. అనంతరం ఆయనను పెరూ దేశంలోని చిక్లాయో నగర బిషప్‌గా నియమించారు. 2014 నుంచి 2023 వరకూ దాదాపు దశాబ్దకాలం ఈ బాధ్యతలు నిర్వహించారు. 2015 నుంచి పెరూ దేశ పౌరునిగా ఆ దేశ పాస్‌పోర్టు కలిగి ఉన్నారు.