Pakistan: పీఓకేను భారత్ ఆక్రమిస్తుందా..? సరిహద్దు గ్రామాలను అప్రమత్తం చేసిన పాకిస్తాన్…!

పాకిస్తాన్ (Pakistan) తీవ్ర యుద్ధభయంలో ఉంది. గత కొన్నేళ్లుగా పీఓకేపై ఉపఖండంలో తీవ్ర చర్చ జరుగుతోంది. పహల్గాం దాడికి ముందు మనం ఆక్రమించక్కర్లేదు. పీఓకే వచ్చి మనతో చేరుతుందని సాక్షాత్తూ భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.. కశ్మీర్ పర్యటనలో బహిరంగంగా ప్రకటించారు. మరోవైపు.. పీఓకేలో సైతం పాకిస్తాన్ వ్యతిరేకగళాలు పెరిగిపోతున్నాయి. తమ ప్రాంతాన్ని పాక్ లూఠీ చేస్తోందని అక్కడి ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. వారిని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సైన్యం అణచివేస్తోంది. ఎంతలా అణిచివేస్తున్నా ఆందోళనలు ఆగడం లేదు.
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఈ క్రూరమైన దాడి కశ్మీర్ వివాదాన్ని మరోసారి అంతర్జాతీయ చర్చకు తెరతీసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను భారత్ స్వాధీనం చేసుకోవాలనే సూచనలు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి.
పీఓకేలో అటెన్షన్…
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, స్థానిక ప్రభుత్వం వాస్తవాధీన రేఖ (LoC) సమీపంలోని 13 నియోజకవర్గాల ప్రజలను రెండు నెలలకు సరిపడా ఆహారం మరియు ఇతర అవసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ఆదేశించింది. PoK అధికారి చౌధ్రీ అన్వర్ ఉల్హాక్ ఈ సూచనలను స్థానిక అసెంబ్లీలో ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా చూడటానికి రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ సూచనలు..
బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్(meghnad).. కశ్మీర్ వివాదానికి శాశ్వత పరిష్కారంగా PoKను భారత్ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఈ చర్య ఉగ్రవాదాన్ని అరికట్టడంతో పాటుగా కశ్మీర్ సమస్యను సమూలంగా పరిష్కరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడిని క్రూరమైన చర్యగా ఖండిస్తూ, భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కఠిన స్పందనను చూపాలని కోరారు. ఈ ఘటన కశ్మీర్ వివాదంలో చివరిది కావాలని ఆయన ఆకాంక్షించారు.
భారత్ స్పందన, భవిష్యత్తు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత, భారత్ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి భారత సైన్యం మరియు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో, PoK సమస్యను దౌత్యపరంగా మరియు వ్యూహాత్మకంగా పరిష్కరించేందుకు ఒత్తిడి పెరుగుతోంది. PoKలో పెరుగుతున్న అసంతృప్తి మరియు భారత్ అనుకూల సెంటిమెంట్ ఈ ప్రాంతంలో రాజకీయ మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.