Islamabad: ముప్పేట దాడితో పాక్ ఉక్కిరిబిక్కిరి.. పాక్ మంత్రుల అవాకులు చవాకులు

పహల్గాం ఉగ్రదాడి పరిణామాలతో అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటరి చేసింది భారత్. పాక్ పై యుద్ధం అంటూ కథనాలు వస్తున్నా.. ముఖ్యంగా ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డివిరిచే ప్రయత్నాలు మోడీ సర్కార్ నిమగ్నమైంది. పాకిస్తాన్ కు వరుసగా షాకుల మీద షాకులిస్తోంది. అందులో కీలకమైంది సింధునదీ ప్రవాహాన్ని నిలిపివేస్తామని స్పష్టం చేయడం. ఈ పరిణామం పాకిస్తాన్ లో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే పాక్ వ్యవసాయరంగానికి జీవనాడిగా సింధూనదిని చెప్పవచ్చు. అక్కడి సంపన్న రాష్ట్రాలైన పంజాబ్ సహా పలు ప్రాంతాలు.. సింధూనది ప్రవాహంతో ధాన్యాగారాలుగా మారాయి. ఇప్పుడు ఆ నదీ ప్రవాహం నిలిచిపోతే.. అక్కడి ప్రజల పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు దారుణంగా మారనున్నాయి.
భారత్(India) చేపట్టిన ఆర్థిక యుద్ధాన్ని నిలువరించేందుకు పాకిస్తాన్ దగ్గర ఎలాంటి అస్త్రం లేకుండా పోయింది. ఆ దేశం నుంచిఉత్తర కుమార ప్రజ్ఞలు వస్తున్నాయి తప్ప, దీన్ని ఎలా నిలువరించాలో తెలియడం లేదు. ఆ దేశప్రధాని షెహబాజ్…స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేయగా.. మంత్రులేమో ఇండియాపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ వీటిని మోడీ సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదు.
లేటెస్టుగా. .. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రేలాపనలు చేశారు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ అవాకులు చవాకులు పేలారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. అసలు భారత్ ను ఎదుర్కోవడమెలా అని సైన్యం తల పట్టుకుంటుంటే.. సాక్షాత్తూ రక్షణమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడడం మరింత ప్రమాదకరంగా మారింది.
ఈ ఒప్పందం నిలిపివేత పాక్ నేతలు పలుమార్లు భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో (Bilawal Bhutto) జర్దారీ అయితే.. ఏకంగా భారత్ కు నేరుగా హెచ్చరికలు చేశారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ మాట్లాడారు.