Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఫేజ్ 2 షురూ… పాక్ నగరాలపై డ్రోన్ ల వర్షం!!

భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన పాకిస్థాన్‌కు (Pakistan) భారత్ (India) గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో (Lahore) ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను (Air Defence System) భారత సైన్యం ధ్వంసం చేసినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. నియంత్రణ రేఖ (LoC) వెంట కాల్పుల విరమణ ఉల్లంఘనలు, భారీ ఫిరంగుల దాడులతో జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాలు యుద్ధభూమిగా మారాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ చైనా తయారీ హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగించి డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, అదామ్‌పుర్, భఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. అయితే, భారత ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలు ఈ దాడులను సమర్థంగా అడ్డుకున్నాయి. రక్షణశాఖ వర్గాలు ఈ దాడులకు రుజువుగా డ్రోన్ల శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపాయి.
పాకిస్థాన్ దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) కింద పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ క్రమంలో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఈ దాడులు పాకిస్థాన్ సైనిక సామర్థ్యానికి తీవ్ర గండి కొట్టాయి. భారత్ ఈ దాడులను వ్యూహాత్మకమైనవిగా పేర్కొంది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు రక్షణశాఖ వెల్లడించింది.
నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. మోర్టార్లు, భారీ ఫిరంగులతో దాడులను ముమ్మరం చేసింది. రాజౌరీ, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో గ్రామాలు, ఇళ్లు, దేవాలయాలు, గురుద్వారాలు, మసీదులు ధ్వంసమయ్యాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి, షాపూర్, మన్‌కోట్, రాజౌరీలోని లామ్, మంజకోట్, గంబీర్ బ్రాహ్మణ ప్రాంతాలు ఈ దాడులకు గురయ్యాయి. దీంతో జమ్మూ, సాంబా, కఠువా, రాజౌరీ, పూంచ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థలను మూసివేశారు. స్థానికులు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.