Harop: పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసిన హారప్!

పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై దాడి కోసం ఇజ్రాయెల్ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యునిషన్ ‘హారప్’ను భారత్ ఉపయోగించింది. దీంతో ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణాసియాలో తొలిసారిగా వినియోగించినట్లయింది. పాకిస్థాన్(pakistan)కు చెందిన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యంతరశ్రేణి క్షిపణి వ్యవస్థ హెచ్‌క్యూ-16లో భాగంగా ఉన్న ఎల్‌వై80 రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్లు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
గాంఢీవమే…
హారప్.. దీర్ఘశ్రేణి స్టాండాఫ్ లాయిటరింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసింది. మానవరహిత విమానం (UAV), క్షిపణి లక్షణాలు కలిగిఉండటం దీని ప్రత్యేకత. శత్రువుల ఆదేశిక వ్యవస్థలు, సరఫరా డిపోలు, ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
హారప్‌లో ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు, కలర్ సీసీడీ కెమెరా, యాంటీ రాడార్ హోమింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. లక్ష్యాలను నిర్దిష్టంగా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతాలపై ఇది 9 గంటల పాటు గగనవిహారం చేస్తూ ఉండగలదు. ఈ క్రమంలో పూర్తి నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది. తద్వారా దాడిపై పక్కా ప్రణాళిక రచించడానికి సాయపడుతుంది. అద్భుత విన్యాసాలు చేయగల సామర్థ్యం దీని సొంతం. పరిస్థితిని గమనించి, అనువైన కోణంలో విరుచుకుపడుతుంది.
ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలు పొందకుండా దీన్ని అడ్డుకోవడం (జామింగ్) సాధ్యం కాదు. అందువల్ల కమ్యూనికేషన్ సవాళ్లను ఇది అధిగమించగలదు. హారప్ డ్రోన్లను ప్రయోగించాక సొంతంగా పనిచేసేలా స్వేచ్ఛ ఇవ్వొచ్చు. అవసరమైతే రిమోట్ సాయంతో నియంత్రించొచ్చు. అందువల్ల దీన్ని గైడెడ్ క్షిపణిగా కూడా ఉపయోగించొచ్చు. కావాలనుకుంటే చివరి నిమిషంలో దాడిని విరమించుకునే వెసులుబాటు కూడా ఉంది.
హారప్‌ను సులువుగా భిన్న వాతావరణాలు, భూభాగాల నుంచి ప్రయోగించొచ్చు. సీల్ చేసిన ప్రత్యేక కంటైనర్లు, డ్రోన్లను ట్రక్కులు, యుద్ధనౌకల నుంచి వీటిని నింగిలోకి పంపొచ్చు. లక్ష్యాన్ని పేల్చకుంటే అది స్థావరానికి తిరిగొస్తుంది. శత్రు రాడార్లకు అంత సులువుగా దొరకని రీతిలో స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. యాంటీ రేడియేషన్ సామర్థ్యం కూడా దీనికి ఉంది. యుద్ధంలో తొలుత శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించడానికి వాడే క్షిపణులు, రాడార్లను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉండటమే కారణం.
హారప్ పరిధి వెయ్యి కిలోమీటర్లు. అందువల్ల శత్రు గగనతలంలోకి చాలాదూరం వరకూ వెళ్లి దాడి చేయడానికి వీలవుతుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది అద్భుతంగా పనిచేయగలదు. శత్రు గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేయడానికి చౌకైన వ్యవస్థలను రూపొందించే లక్ష్యంలో 1980లలో ఇజ్రాయెల్ హారప్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో క్రూజ్ క్షిపణులు, మానవరహిత విమానాల్లోని అంశాలను కలగలిపింది.