India-Pakistan: భారత్-పాకిస్తాన్ మధ్య అనధికారిక యుద్ధం..!

భారత్ – పాకిస్తాన్ (Indo Pak War) మధ్య ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ జమ్మూ కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి తీవ్రమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ 24 గంటల వ్యవధిలో జరిగిన సంఘటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చాయి. అలాగే పౌరులపై, మతపరమైన స్థలాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. భారత సైన్యం నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్”కు (Operation Sindoor) ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం చేపట్టిన కాల్పుల విరమణ ఉల్లంఘనలకు (Cease fire) పాల్పడింది. దీంతో రెండు దేశాల మధ్య అనధికార యుద్ధం సాగుతోంది.
మే 6-7 రాత్రి భారత సైన్యం పాకిస్తాన్‌లోని (Pakistan) తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడులు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు చేపట్టినట్లు అధికారికంగా భారత్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌కు ప్రతీకారంగా, మే 7-8 రాత్రి నుంచి పాకిస్తాన్ సైన్యం కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్, పూంచ్, మెంధర్, రజౌరీ ప్రాంతాల్లోని LoC వెంబడి చిన్న ఆయుధాలు, ఆర్టిలరీ గన్‌లతో కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో మోర్టార్లు, భారీ కాలిబర్ ఆర్టిలరీని ఉపయోగించంది. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది.
భారత సైన్యం ఈ కాల్పులకు దీటుగా సమాధానమిచ్చింది. పాకిస్తాన్ మిసైళ్లను భారత మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ (Missile Defence System) సమర్థంగా ఎదుర్కొంది. గాలిలోనే వాటిని పేల్చేసింది. అయితే ఈ కాల్పుల వల్ల జమ్మూ కాశ్మీర్‌లోని పలుచోట్ల ప్రజలకు నష్టం జరిగింది. పూంచ్‌లో ఒక ఆలయం, గురుద్వారా, మసీదు దెబ్బతిన్నాయి. దీనివల్ల స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. విదేశాంగ శాఖ (MEA) ఎక్స్‌పీ డివిజన్ ప్రకారం, పూంచ్‌లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 59 మంది గాయపడ్డారు, వీరిలో 44 మంది పూంచ్‌కు చెందినవారు.
ఈ సంఘటనలు స్థానిక పౌర జీవనంపై గణనీయమైన ప్రభావం చూపాయి. ఉరిలో కాల్పుల వల్ల సంభవించిన అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. స్థానికులు “పాకిస్తాన్ ముర్దాబాద్” నినాదాలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఈ సంఘటనలపై తీవ్ర చర్చ జరుగుతోంది. 1992 తర్వాత భారత్ – పాక్ మధ్య ఈ స్థాయి ఉద్రిక్తతలు తలెత్తడం ఇదే తొలిసారి అని కొందరు చెప్తున్నారు. మరోవైపు పాక్ కాల్పుల ఉల్లంఘనలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ పాకిస్తాన్ చర్యలను ఖండించింది. అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ చర్యలను ఖండించాలని కోరింది. పాకిస్తాన్ వైపు నుంచి ఈ సంఘటనలపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ స్థానిక మీడియా నివేదికలు భారత దాడులను ఖండిస్తూ, తమ చర్యలను సమర్థించుకున్నాయి. అయితే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాత్రం ప్రపంచదేశాలు తమకు సాయం అందించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసింది.
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన సంఘటనలు రెండు దేశాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలను మరోసారి బహిర్గతం చేశాయి. ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనలు పౌరుల ప్రాణనష్టం, ఆస్తి నష్టం, సామాజిక అశాంతికి దారితీశాయి. ఈ సంఘటనలు భవిష్యత్తులో దౌత్యపరమైన చర్చలు, సైనిక వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.