Operation Sindoor: భారత్ మెరుపు దాడులు.. పాకిస్తాన్ బెంబేలు..!!

పహల్గాం దాడికి (Pahalgam Terror Attack) భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. పహల్గామ్‌లో గత నెల 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులు లష్కర్-ఎ-తొయిబా (LeT) మరియు జైష్-ఎ-మహమ్మద్ (JeM) నిర్వహించినట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు (RAW) గుర్తించాయి. ఈ దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు ఊహించని శిక్ష విధిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు.
భారత సైన్యం పాకిస్తాన్‌లోని నాలుగు స్థావరాలు, PoKలోని ఐదు స్థావరాలు సహా మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇందులో లష్కర్-ఎ-తొయిబా మురిద్కే హెడ్‌క్వార్టర్స్, జైష్-ఎ-మహమ్మద్ బహవల్పూర్ స్థావరాలు ఉన్నాయి. ఖచ్చితమైన దాడుల కోసం SCALP క్రూయిజ్ మిస్సైల్స్, హామర్ స్మార్ట్ బాంబులు, లోటరింగ్ మ్యూనిషన్స్ (కామికేజ్ డ్రోన్స్) ఉపయోగించినట్లు సమాచారం. ఈ తెల్లవారుజామున 1:44 గంటలకు భారత గగనతలం నుంచి ఈ దాడులు జరిగాయి. పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండానే భారత యుద్ధ విమానాలు ఈ టార్గెట్స్ ను మట్టుబెట్టాయి.
భారత్ దాడుల్లో దాదాపు 90 మంది వరకూ ఉగ్రవాదులు చనిపోయినట్లు ప్రాథమిక అంచనా. అయితే పాకిస్తాన్ మాత్రం 9 మంది పౌరులు మరణించినట్లు చెప్తోంది. 38 మంది గాయపడినట్లు వెల్లడించింది. మరోవైపు.. భారత్ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి బింబర్ గలి, పూంచ్, రాజౌరీ ప్రాంతాలలో ఆర్టిలరీ షెల్లింగ్‌తో దాడులు చేస్తోంది. ఇందులో ముగ్గురు భారత పౌరులు మరణించారు, ఏడుగురు గాయపడ్డారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేస్తున్న దాడులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ఈ దాడులను “యుద్ధ చర్య”గా అభివర్ణించారు. తగిన సమయంలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్ యొక్క ఉగ్రవాద స్థావరాల లక్ష్యం గురించిన వాదనలను తోసిపుచ్చారు.
భారత్ దాడులు నాలుగు జైష్-ఎ-మహమ్మద్, మూడు లష్కర్-ఎ-తొయిబా, రెండు హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి 2008 ముంబై దాడులు, 2019 పుల్వామా దాడి వంటి గత ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ స్థావరాల ధ్వంసం కావడం వల్ల ఈ గ్రూపుల శిక్షణ, కార్యకలాపాలు కుంటుపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, మురిద్కేలోని లష్కర్-ఎ-తొయిబా స్థావరం, బహవల్పూర్‌లోని జైష్-ఎ-మహమ్మద్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులు ఉగ్రవాద గ్రూపుల ఆర్థిక వనరులు, శిక్షణ సౌకర్యాలు, నాయకత్వంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అయితే వీటి నుంచి త్వరలోనే బయటపడి కొత్త స్థావరాలు ఏర్పాటు చేసుకుని ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటన త్వరగా ముగియాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో భారత్, పాకిస్తాన్ నాయకులతో చర్చలు జరిపారు. యూఎన్ సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రస్ రెండు దేశాలను గరిష్ట సైనిక సంయమనం పాటించాలని కోరారు. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని హెచ్చరించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యూఎస్, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా దేశాలతో ఈ ఆపరేషన్ గురించి చర్చించారు. ఆపరేషన్ సిందూర్ భారత్ ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని, వ్యూహాత్మక సామర్థ్యాన్ని స్పష్టంగా చాటింది.