Fake News: చూసేవన్నీ నిజం కాదు.. మీడియాలో ఫేక్ వార్తల జోరు…!!

భారత్-పాకిస్తాన్ (Indo Pak War) మధ్య ఇఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా (Social Media) ఫేక్ వార్తల (Fake News ) కేంద్రంగా మారింది. పహల్గాం ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 26 మంది మరణించిన తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల అనంతరం, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ సమయంలో సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోంది. దురదృష్టవశాత్తూ కొన్ని ప్రధాన మీడియా సంస్థలు కూడా అధికారిక నిర్ధారణ లేకుండా ఈ ఫేక్ వార్తలను ప్రసారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇందులో భారత సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) వద్ద తెల్ల జెండా ఎగురవేసి శరణు కోరుకుంటున్నట్టు ఉంది. భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్-చెక్ చేసి ఈ వీడియోను ఫేక్‌గా గుర్తించింది. ఈ వీడియో వాస్తవానికి 2019లో పాకిస్తాన్ సైన్యం తెల్ల జెండా ఎగురవేసిన సంఘటనకు సంబంధించినదని తేలింది. అయినప్పటికీ కొన్ని మీడియా చానళ్లు ఈ వీడియోను ప్రసారం చేసేశాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించాయి. మరో వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పాకిస్తాన్ వైమానిక దళం భారత సైనిక స్థావరాలపై దాడి చేసిందని, అమృతసర్‌లోని ఒక సైనిక కేంద్రాన్ని ధ్వంసం చేసిందని క్లెయిమ్ చేస్తూ ఆ వీడియో ఉంది. అయితే ఈ వీడియో 2024లో జరిగిన ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించినదని పీఐబీ ఫ్యాక్ట్-చెక్ తెలిపింది. ఈ విషయంలో కూడా కొన్ని టీవీ చానళ్లు అధికారికంగా ధృవీకరించుకోకుండానే ప్రసారం చేశాయి.
పాకిస్తాన్ ఈ ఉద్రిక్తతలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు సోషల్ మీడియాను ఒక ఆయుధంగా ఉపయోగిస్తోంది. భారత యుద్ధ విమానాలు కూలిపోయాయని, పాకిస్తాన్ ఐదు భారత జెట్‌లను ధ్వంసం చేసిందని క్లెయిమ్ చేస్తూ పాత చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2024లో రాజస్థాన్‌లో జరిగిన మిగ్-29 క్రాష్ ఫోటోను పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ తాజా దాడులకు సంబంధించినదిగా చిత్రీకరించాయి. ఈ తప్పుడు సమాచారం కొన్ని భారతీయ మీడియా సంస్థల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
దేశంలోని కొన్ని ప్రధాన టీవీ చానళ్లు (TV Channels) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెంట్‌ను వేగంగా ప్రసారం చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ గాజాలో జరిగిన దాడిని పాకిస్తాన్‌లో భారత చేసినట్లుగా ప్రసారం చేసింది. ఇలాంటి వార్తలు ప్రజల్లో గందరగోళం సృష్టించడమే కాక, రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచుతాయి. అధికారిక వర్గాలైన పీఐబీ లేదా భారత సైన్యం నుంచి సమాచారాన్ని ధృవీకరించుకోవడం ఈ సందర్భంలో కీలకం. కానీ రేటింగ్‌ల కోసం కొన్ని చానళ్లు (News Channels) ఈ బాధ్యతను విస్మరిస్తున్నాయి.
ఈ సమస్యను అధిగమించడానికి మీడియా సంస్థలు అధికారిక వర్గాల నుంచి సమాచారాన్ని ధృవీకరించుకోవడం తప్పనిసరి. పీఐబీ ఫ్యాక్ట్-చెక్ వంటివి ఫేక్ వార్తలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తనూ నమ్మకుండా, అధికారిక వెబ్‌సైట్‌లు లేదా నమ్మకమైన న్యూస్ ఛానల్స్ ద్వారా వాస్తవాలను తెలుసుకోవాలి. భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పాకిస్తాన్ మూలాల నుంచి వచ్చే కంటెంట్‌ను నిషేధించాలని ఆదేశించింది. ఇది ఒక సానుకూల చర్య. అయితే మీడియా సంస్థలు కూడా తమ బాధ్యతను గుర్తించి ఫేక్ వార్తల వ్యాప్తిని అరికట్టడంలో సహకరించాలి.