Indian Navy: సముద్ర అలలపై భారత నేవీ ‘త్రిశూల శక్తి’

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. వార్ డ్రిల్స్ లో భాగంగా భారత నౌకా దళం.. సన్నాహక చర్యలు తీసుకుంటోంది.ఈ నేపథ్యంలో భారత నౌకాదళం (Indian Navy) సముద్రంలో గస్తీ కాస్తున్న చిత్రాన్ని షేర్ చేసింది. అందులో ఒక నౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ దర్శనమిచ్చాయి. అవి.. ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH), స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి.‘‘భారత నేవీ త్రిశూల శక్తి.. సముద్రం పైన.. కింద.. అలల మీదుగా’’ అని అర్థం వచ్చేలా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ‘Anytime Anywhere Anyhow’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.
అత్యంత అధునాతనమైన స్కార్పీన్ తరగతి జలాంతర్గాములు భారత నౌకాదళంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇవి శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాముల వేట, నిఘా సమాచార సేకరణ, సాగరజలాల్లో మందుపాతరలు అమర్చడం, నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యర్థుల కదలికలపై కన్నేసి ఉంచడం వంటి కార్యకలాపాలు సాగించగలవు. ఫ్రాన్స్ తోడ్పాటుతో నిర్మించిన ఈ జలాంతర్గాములకు శత్రువుల నిఘా సాధనాలకు దొరకని రీతిలో అద్భుతమైన స్టెల్త్ లక్షణాలు ఉన్నాయి. టోర్పిడోలు, నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించగలవు. భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్ కోల్‌కతా ప్రధాన డెస్ట్రాయర్. ఇది భారత నౌకాదళానికి చెందిన శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఇది ఒకటి.
పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనక ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇక ఈ ఘటన తర్వాత పాక్ నడ్డివిరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో సింధూజలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి. ఇక, కొన్ని నెలల క్రితం నిలిపివేసిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ (ALH Dhruv) కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆర్మీ (Indian Army), ఎయిర్‌ఫోర్స్‌ల్లో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. నౌకాదళంలో ఈ హెలికాప్టర్లకు మాత్రం అనుమతివ్వలేదని తెలిసింది.