Diego Garcia: హిందూ మహాసముద్రంపై పట్టుకోసం అమెరికా, చైనా ప్రయత్నాలు…

హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్(chagos islands) ఒకప్పుడిది బ్రిటిష్ సామ్రాజ్య ఏలుబడిలో ఉండేది. ఈ ద్వీప సమూహాన్ని మారిషస్‌కు అప్పగించి, ఆ దీవుల్లో అతిపెద్దదైన డియేగో గార్సియాను లీజుకు తీసుకోవడానికి బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకోనుంది. అక్కడ బ్రిటిష్- అమెరికన్ సంయుక్త సైనిక, వైమానిక స్థావరం ఉంది. దీంతో ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆమోద ముద్ర వేశారు.
డియేగో గార్సియాకు అమెరికా ఇటీవలే ఆరు బి-2 స్టెల్త్ బాంబర్ విమానాలను తరలించింది. అమెరికాకు మొత్తం 20 బి-2 బాంబర్లు ఉండగా, వాటిలో ఆరింటిని ఒక్క డియేగో గార్సియాలోనే మోహరించిందంటే … ఈ ప్రాంతం ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.అంతేకాదు…హిందూ మహాసముద్రంలో తమ పట్టు నిలబెట్టుకునే విషయంలో ఆంగ్లో-అమెరికన్ కూటమి ఎంత కృత నిశ్చయంతో ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. డియేగో గార్సియా దీవి నుంచి బయలుదేరిన బి-2 బాంబర్లు యెమెన్‌లో ఇరాన్ మద్దతు గల హౌతీ దళంపై మార్చి 15 నుంచే బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. హౌతీల బంకర్లతోపాటు యెమెన్‌లోని హొడైడా రాష్ట్రంలోని రాస్ ఈసా ఓడ రేవు, విమానాశ్రయం కూడా వైమానిక దాడులకు గురయ్యాయి.
ఇరాన్‌కు ఆల్టిమేటం
హౌతీల మద్దతుదారైన ఇరాన్‌కు హెచ్చరికగా అమెరికా ఒకవైపు దాడులు చేపడుతూనే, మరోవైపు ఆ దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు పునరుద్ధరించింది. ఇరాన్ అణు బాంబును తయారు చేయకుండా అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని అమెరికా కోరుతోంది. మే నెలలోగా అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌కు అల్టిమేటం ఇచ్చింది. ఏ కారణంతోనైనా ఇరాన్‌తో సంబంధాలు విషమిస్తే డియేగో గార్సియా దీవి నుంచి బి-2 బాంబర్లు పంపుతానని హౌతీలపై దాడుల ద్వారా అమెరికా పరోక్షంగా హెచ్చరిస్తోంది. దీన్నిబట్టి ఆంగ్లో- అమెరికన్ వ్యూహంలో డియేగో గార్సియా ప్రాధాన్యం ఏంటో అవగతమవుతోంది.
హిందూ మహాసముద్రంలో అమెరికాకు ఉన్న ఏకైక ప్రధాన స్థావరం డియేగో గార్సియానే. ఇక్కడ మోహరించిన బి-2 బాంబర్ విమానం ఒక్కొక్కటి 11వేల కిలోమీటర్ల పరిధిలోని ఏ లక్ష్యంపైనైనా దాడి చేయగలదు. అంటే ఈ దీవి నుంచి ఆసియా, ఆఫ్రికా, పశ్చిమాసియాలపై దాడులు చేసే సత్తా అమెరికాకు ఉందన్నమాట. డియేగో గార్సియా నుంచి బయలుదేరిన అమెరికన్ విమానాలే గల్ఫ్ యుద్ధం, ఇరాక్, అఫ్గానిస్థాన్ యుద్ధాల్లో పాల్గొన్నాయి. తాజాగా హౌతీలపై దాడులు చేస్తున్నాయి.
డియేగో గార్సియాతో పాటు చాగోస్ దీవులు 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ ఆధీనంలో ఉండేవి. అక్కడ చెరకు తోటల్లో పని చేయడానికి భారత్, ఆఫ్రికాల నుంచి బానిసలను తీసుకొచ్చారు. 1814లో కుదిరిన ఒప్పందం కింద మారిషస్‌తోపాటు చాగోస్ ద్వీప సముదాయాన్ని బ్రిటన్‌కు ఫ్రాన్స్ దత్తం చేసింది. 1965లో బ్రిటన్ మారిషస్ నుంచి చాగోస్‌ను విడదీసి బ్రిటిష్ హిందూ మహాసముద్ర భూభాగంగా ప్రకటించింది. దీనికి బదులుగా మారిషస్‌కు ఏడాదికి 30 లక్షల పౌండ్లను చెల్లిస్తూ వస్తోంది. చాగోస్ సమూహంలోని డియేగో గార్సియాలో 1986 నుంచి ఆంగ్లో-అమెరికన్ సైనిక- వైమానిక స్థావరం నడుస్తోంది. డియేగోపై మారిషస్‌కే సార్వభౌమ హక్కులు ఉన్నాయని 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్మానించింది. అందుకే చాగోస్‌పై అధికారాన్ని వదిలేసుకున్న బ్రిటన్, ఆ దీవులను మారిషస్‌కు అప్పగించి, డియేగో గార్సియాను మాత్రం 99 ఏళ్ల లీజుకు తీసుకోవడానికి సిద్ధమైంది.
డ్రాగన్‌ను నిరోధించేందుకు…
మారిషస్ జనాభాలో 70 శాతంమంది భారత సంతతివారే. మారిషస్‌కు సొంత సైన్యం కానీ, నౌకాదళం కానీ లేవు. పోలీసు బలగం, తీర రక్షక దళం మాత్రమే ఉన్నాయి. ఆ రెండింటికి భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు. మారిషస్‌కు చెందిన అగలేగా దీవిలో భారతీయ నౌకా స్థావరం నిర్మితమవుతున్నట్లు 2021లోనే వార్తలు వచ్చాయి. సమీపంలోని మాల్దీవులలో చైనా ఇప్పటికే పాగా వేసినందువల్ల భారత్ సైనిక వ్యూహంలో మారిషస్, అగలేగా, డియేగో గార్సియాలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. నేడు పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు చైనా నౌకాదళ సంచారం ఎక్కువైంది. చైనాపై నిఘా వేయడానికీ, డ్రాగన్ దుస్సాహసాలను నిరోధించడానికీ డియేగో గార్సియాలోని ఆంగ్లో-అమెరికన్ స్థావరం ఉపకరిస్తుందని క్వాడ్ సభ్య దేశమైన భారత్ భావిస్తే ఆశ్చర్యం లేదు. అందుకే చాగోస్-డియేగో గార్సియాల విషయంలో మారిషస్- ఆంగ్లో అమెరికన్ ఒప్పందాలపై ఇండియా ఆసక్తి కనబరుస్తోంది.