Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రకోటలు తునాతునకలు..

ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైనిక దళాలు చేపట్టిన మిషన్.. పీఓకే, పాకిస్తాన్ లోని ఉగ్రకోటల్ని నేలమట్టం చేశాయి. ఇందులో ప్రధానమైనవి మురిద్కేలోని లష్కరే తయ్యిబా ప్రధాన స్థావరం…బహవల్ పూర్ లోని జైషే మొహమ్మద్ కార్యాలయం, ముజఫరా బాద్ లోని హిజ్బుల్ ముజాహుద్దీన్ సంస్థలు. ఇవి ప్రపంచానికి పెను సమస్యగా మారిన ఉగ్రపుట్టలు.ఈ ఉగ్రపుట్టలను ధ్వంసం చేసి, అందులోని ఉగ్రనాగులను హతమార్చాయి భారత దళాలు.
భారత్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాదానికి పెద్దన్నగా గుర్తించి నిషేధించిన…. లష్కరే తయ్యిబా (ఎల్‌ఈటీ)ను హఫీజ్ మొహమ్మద్ సయీద్ 1990లో ఏర్పాటు చేశాడు. లాహోర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురీద్కే పట్టణంలో దీని కేంద్ర కార్యాలయం ఉంది. 200 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉగ్ర శిబిరాన్ని సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన విరాళాలతో నిర్మించారు. 2002లో పాకిస్థాన్ కూడా దీన్ని నిషేధించింది. అయినా సంస్థ కార్యకలాపాలకు కావాల్సిన సహకారాన్ని అందిస్తూనే వచ్చింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ లష్కరే క్యాంపులు నెలకొల్పి నియామకాలు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. దాదాపు 2,200 కార్యాలయాలు నెలకొల్పి పాకిస్థాన్ వ్యాప్తంగా విస్తృత కార్యకలాపాలు నడుపుతోంది. 2006 నవంబరు 7న ముంబయిలో రైళ్లలో బాంబుదాడులు చేసి 200 మందికి పైగా మృతికి కారణమైంది. 2008 నవంబరు 26న పదిమంది లష్కరే ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి ముంబయిలోని తాజ్ హోటల్‌లో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది మరణించారు. 2000 డిసెంబరులో దిల్లీలోని ఎర్రకోటపై దాడికి పాల్పడిందీ ఈ సంస్థే.
జైషే మొహమ్మద్ (JEM), బహావల్‌పుర్
భారతదేశ మోస్ట్‌వాంటెడ్ మౌలానా మసూద్ అజహర్ 2000 డిసెంబరు 21నాడు జైషే మొహమ్మద్ (జేఈఎం)ను స్థాపించాడు. ఈ పాకిస్థానీ సున్నీ ఇస్లామిస్ట్ తీవ్రవాద ముఠా.. అటు యూరప్‌లోనూ పంజా విసురుతోంది. అందుకే ఐక్యరాజ్యసమితితోపాటు అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా దీన్ని గుర్తించాయి. దీనికి సంబంధించిన కార్యకలాపాలన్నీ పాకిస్థాన్‌లోని బహావల్‌పుర్ కేంద్రంగా జరుగుతున్నాయి. సోవియట్ – అఫ్గాన్ యుద్ధంలో ఆరితేరిన అరబ్ సైన్యానికి చెందిన పలువురు ఫైటర్లు జైషే మొహమ్మద్‌లో ఉన్నారు. వీరితోపాటు కశ్మీర్ నుంచి వచ్చిన పలువురు యువకులకూ శిక్షణనిచ్చి కరుడుగట్టిన ఉగ్రవాదులుగా మార్చిందీ సంస్థ. ఓ వైపు లష్కరే తయ్యిబా, మరోవైపు తాలిబన్లతో కూడా దీనికి సాయుధ సమన్వయం ఉంది. జమ్మూ కశ్మీర్ శాసనసభ భవనంపై 2001లో జైషే చేసిన ఆత్మాహుతి బాంబు దాడిలో 30 మందికి పైగా మృతిచెందారు. 2019లో పుల్వామాలో 40 మంది భారత పారామిలిటరీ సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు.
హిజ్బుల్ ముజాహిదీన్(HIzbul), ముజఫరాబాద్
1989లో కశ్మీర్‌లో ఏర్పాటైన హిజ్బుల్ ముజాహిదీన్ ..పాకిస్థానీ ఛాందసవాద జమాతే ఇస్లామీ భావజాలంతో పురుడుపోసుకుంది. ఒక దశలో జమ్మూకశ్మీర్‌ను వణికించిన ఈ సంస్థ ప్రభావం 2016, 2017లో దాని ప్రధాన కమాండర్లైన బుర్హాన్ వనీ, షబ్‌జార్ అహ్మద్ భట్ వరసగా మృతిచెందడంతో క్షీణించింది. అయినా పాకిస్థాన్ అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో సయ్యద్ సలాహుద్దీన్ నాయకత్వంలో మనుగడ సాగిస్తోంది.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF), మురీద్కే
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత వెలుగులోకి వచ్చిన టీఆర్‌ఎఫ్, లష్కరే తయ్యిబా అనుబంధ సంస్థ. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ దీన్ని సృష్టించింది. సోషల్ మీడియాలో ‘కశ్మీర్ రెసిస్టెన్స్’ పేరుతో తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించిన ఈ సంస్థ తర్వాత నేరుగా ఉగ్రదాడులకు తెరతీసింది. లష్కరే కేంద్ర స్థావరమైన మురీద్కే నుంచి కార్యకలాపాలు నిర్వహించే టీఆర్‌ఎఫ్‌కు సాజిత్ జాట్, సజ్జద్ గుల్, సలీం రెహ్మానీలు నాయకులుగా చలామణి అవుతున్నారు. 2020లో కుప్వారా సమీపంలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటన సందర్భంగా టీఆర్‌ఎఫ్ పేరు మొదటిసారి బయటకు వచ్చింది. అదే ఏడాది దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను తామే చంపినట్లు ప్రకటించింది. 2024లో అందర్‌బల్ జిల్లాలో కాల్పులు జరిపి ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికుల మృతికి కారణమైందీ ఈ సంస్థే అని భావిస్తారు. ఇక ఇటీవల పహల్గాం సమీపంలోని బైసరన్‌లో జరిగిన ఊచకోతతో రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు అందరికీ తెలిసింది.
ఇవే కాకుండా హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి విడిపోయి మరో ఉగ్రవాద సంస్థగా ఏర్పడిన అల్‌బదర్ పాకిస్థాన్‌లోని మన్సేరా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దీంతోపాటు అంతర్జాతీయ జిహాదీ బృందాలతో సంబంధాలున్న అనేక సంస్థలు పాకిస్థాన్, ఆక్రమిత కశ్మీర్‌లో వేళ్లూనుకుని ఉన్నాయి. మంగళవారం భారత్ సరిగ్గా ఆ మూలాలపైనే విరుచుకుపడింది.