ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అన్నామలై గట్టెక్కేనా...?

అన్నామలై గట్టెక్కేనా...?

కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నామలై ఎదురీదుతున్నారు.ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే తరఫున గణపతి రాజ్‌కుమార్‌, అన్నాడీఎంకే అభ్యర్థిగా రామచంద్రన్‌, బీజేపీ నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అన్నామలైకి మద్దతుగా కోవై, మేట్టుపాళ్యంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించారు. కోవై సౌత్‌ ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చెందిన వానతి శ్రీనివాసన్‌ వ్యవహరిస్తున్నారు.

నియోజకవర్గంలో డీఎంకే, అన్నాడీఎంకేలా బలమైన బూత్‌ కమిటీ సభ్యులు లేకపోవడం బీజేపీకి ప్రతికూల అంశంగా ఉంది. డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మగళిర్‌ ఉరమైతొగై, ఉచిత బస్సు పథకం మహిళలపై ప్రభావం చూపిస్తుండటం అన్నామలైకి తలనొప్పిగా మారింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే, మనిదనేయ మక్కళ్‌ కట్చిలకు చెప్పకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది.

కొంగుమండలంలో గట్టిపట్టున్న రాష్ట్ర మంత్రి సెంథిల్‌బాలాజీని ఈడీ అరెస్టు చేసి జైల్లో ఉంచడాన్ని డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించి అన్నామలైని ఇరకాటంలో పడేస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి రామచంద్రన్‌.. మాజీ మంత్రి వేలుమణి, డీఎండీకే, ఎస్‌డీపీఐ నాయకులతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జౌళి పరిశ్రమకు పేరొందిన నియోజకవర్గంలో పదేళ్లలో వందలాది వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్లే మూతపడ్డాయని ప్రచారం నిర్వహిస్తుండడంతో అన్నామలై ఆందోళన చెందుతున్నారు.

దీంతో ఉత్తరాదితో పాటు తెలుగు ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయా నేతలను ప్రచారానికి దింపుతున్నారు. టీడీపీ యువనేత నారాలోకేష్‌తో.. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయించారు. అలాగే ఉత్తరాది ప్రజలున్న చోట్ల.. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖనేతలతో ప్రచారపర్వం చేయిస్తున్నారు అన్నామలై. ఈ ఎన్నికల్లో గెలవడం అన్నామలైకి కెరియర్‌కు చాలా ముఖ్యమన్న సంగతి ఆయనకు తెలియంది కాదు.

1998, 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన సి.పి.రాధాకృష్ణన్‌ ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో సీపీఐకి చెందిన నల్లకన్ను సి.పి.రాధాకృష్ణన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించలేదు. 2019లో అన్నాడీఎంకే పొత్తుతో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి 3.92 లక్షల ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :