ASBL NSL Infratech

'మరాఠా' వీరులకు పరీక్ష...

'మరాఠా' వీరులకు పరీక్ష...

మరాఠా రాజకీయవీరులకు అగ్ని పరీక్ష. రాజకీయ వ్యూహచతురతకు పెట్టింది పేరైన మహారాష్ట్రలో ఇప్పుడు పార్టీలు విషమ సమస్యను ఎదుర్కొెంటున్నాయి. ఓవైపు మోడీ, షా రాజకీయ వ్యూహాలతో చిన్నా భిన్నమైన మరాఠీ పార్టీలు.. ఇప్పుడు అస్థిత్వ సమస్య ఎదుర్కొంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటకుంటే.. ఇక తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందో అన్న భయం ఆయా పార్టీల్లో అంతర్గతంగా వ్యక్తమవుతోంది. ఆపార్టీలు ఏవో కావు.. శరద్ పవార్, అజిత్ పవార్, ఉద్దవ్, షిండే పార్టీలు.

ఊహించని రీతిలో రెండు ప్రాంతీయ పార్టీలు నాలుగు అయ్యాయి. తమతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి సీఎం కుర్చీ దగ్గర పంచాయితీతో.. కాంగ్రెస్‌, ఎన్సీపీ పంచన చేరిన శివసేనను ఏక్‌నాథ్‌ షిండే ద్వారా చీల్చేసింది బీజేపీ. తద్వారా ఉద్ధవ్‌ థాక్రేకు ఝలక్‌ ఇచ్చింది..తర్వాత అజిత్‌ పవార్‌నూ ఆకర్షించి ఎన్సీపీనీ విడగొట్టి.. శరద్‌ పవార్‌కు షాకిచ్చింది.

ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీలో ఎన్సీపీ (శరద్‌ పవార్‌), శివసేన (ఉద్ధవ్‌) ఎన్నికల సమరంలో తలపడుతున్నాయి. మహారాష్ట్రలో తొలి దశలో 5, మలి విడతలో 8 సీట్లకు పోలింగ్‌ ముగిసింది. మూడో దశలో 11 స్థానాలకు మే 7న ఓటింగ్‌ జరగనుంది. నాలుగో దశలో మే 13న మరో 11 సీట్లకు, మే 20న 13 స్థానాలకు పోలింగ్‌ ఉంది.

నలుగురు నేతలకూ సవాల్‌

మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఉద్ధవ్‌ థాక్రే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, శరద్‌ పవార్‌లకు ఈ ఎన్నికలు చాలా కీలకం. తాను స్థాపించిన పార్టీని.. అన్న కుమారుడు అజిత్‌ చీల్చడంతో హతాశుడైన మరాఠా యోధుడు శరద్‌పవార్‌ ....ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటున్నారు. పార్టీ కేడర్‌ తనను వీడి వెళ్లకుండా ఉండాలన్నా, అసెంబ్లీ ఎన్నికల నాటికి బలీయంగా కనిపించాలన్నా.. పెద్ద పవార్‌ ప్రస్తుత ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించడం ముఖ్యం. ఇకముందు కూడా చెక్కుచెదరకుండా ఉండాలంటే లోక్‌ సభ ఎన్నికల్లో సత్తా చాటాల్సి ఉంది. కాగా, తాను ప్రజాబలం ఉన్న నేతను అని నిరూపించుకునేందుకు సీఎం షిండేకు, తమ ఉనికి ఇంకా ఉందని చాటేందుకు ఉద్ధవ్‌ థాక్రేకు ఈ ఎన్నికలు కీలకం.

బారామతిలో వదినా మరదళ్ల ఢీ

మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగానూ ఆసక్తి రేకెత్తిస్తున్న పోటీ బారామతిలో జరుగుతోంది. సిటింగ్‌ ఎంపీ సుప్రియా తన వదిన సునేత్రను ఢీకొంటున్నారు. మే 7న ఇక్కడ పోలింగ్‌ ఉంది. సుప్రియా ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఇక్కడినుంచి గెలిచారు. ఆమె తండ్రి శరద్‌ పవార్‌ అయితే డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన బారామతిలో సుప్రియా ఓడితే అది శరద్‌కు పెద్ద ఇబ్బందే. బారామతి చేజారితే.. యావత్‌ పార్టీ చేజారినట్టే అని చెప్పొచ్చు..

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :