రివ్యూ : ‘రంగమార్తాండ’ చుస్తే అమ్మనాన్నలకు ఒక్కసారైనా క్షమాపణ చెప్పాలనిపిస్తుంది

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థలు : హౌసేఫుల్ మూవీస్, రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్,
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్,
నటీనటులు: ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఆలీ రెజా తదితరులు
సంగీత దర్శకులు: మ్యాస్ట్రో ఇళయరాజా, సినిమాటోగ్రఫీ: రాజ్ కె నల్లి
ఎడిటర్: పవన్ వికె, నిర్మాతలు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
దర్శకుడు : కృష్ణవంశీ
విడుదల తేదీ: 22.03.2023
కొన్నేళ్ల గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా ‘రంగమార్తాండ’, రంగస్థల నటుల జీవనవిధానాన్ని అద్భుతమైన ‘రంగమార్తాండ’ లో ఆవిష్కరించారు ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గత పదిరోజుల క్రితం నుండి ఈ సినిమా ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్లలో సినీ ప్రముఖులకు ప్రీమియర్ షోస్ వేయడం కృష్ణ వంశీ ధైర్యానికి నిదర్శనం. అంటే సినిమాపై ఆయనకున్న నమ్మకం ఈ థియేటర్లలో విడుదలైన ‘రంగమార్తాండ’ నిలబెట్టిందా లేదా రివ్యూలో చూద్దాం.
కథ:
ఇది అచ్చమైన అమ్మనాన్నల కథ. మన కథ.. మనందరి కథ. ప్రతి తండ్రి సంఘర్షణ. ప్రతి తల్లి ఆవేదన. ప్రతి కొడుకు, కూతురి ఆందోళన ఈ కథలో కనిపిస్తాయి. రాఘవరావు (ప్రకాష్ రాజ్) తన వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకున్న రంగస్థల నటుడు. కళకు ఆయన చేసిన అపూర్వమైన కృషికి, అతనికి రంగమార్తాండ అనే బిరుదు దక్కుతుంది. రాఘవరావు రాఘవరావుకి వయసు మీదపడుతున్నకొద్దీ అతను తన వృత్తి నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుని తన ఆస్తిని పిల్లలైన శ్రీ (శివాత్మిక రాజశేఖర్) మరియు రంగా (ఆదర్శ్ బాలకృష్ణ)కి పంచుతాడు. అనంతరం అతడు, తన భార్య రాజు గారు (రమ్య కృష్ణన్) ఇద్దరూ తమ పిల్లలతో ఎన్నో మాటలు పడతారు. కాగా రంగమార్తాండ రాఘవరావు, ఆయన పిల్లల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా, చక్రపాణి (బ్రహ్మానందం) గా హాస్య బ్రహ్మలో ఉన్న కొత్త నటుడు ఏ మేరకు ఆకట్టున్నాడో మిగతా కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
నటీనటుల హావభావాలు:
ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న కాంచీవరం మూవీలోని పాత్ర మాదిరిగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాలోని రాఘవరావు పాత్రలో మరొకసారి అద్బుతంగా జీవించారు. రంగమార్తాండ రాఘవరావు గా నటించిన ప్రకాష్ రాజ్ జీవితంలోని ఒక్కో ఘట్టం ముందు వెళ్లే కొద్దీ.. నవరసాల కురుక్షేత్రం చూస్తున్నట్టుగానే ఉంటుంది. నవ్వించాడు.. ఏడిపించాడు.. కొన్నిసార్లు ఎహే.. ఈ రంగమార్తాండుడు ఏంటి? ఇలా చేస్తున్నాడు? అని కోప్పడేట్టు కూడా చేశారు ప్రకాష్ రాజ్. రాఘవరావు పాత్రతో జీవితాన్నే ఆవిష్కరించి.. కళ్లకి కట్టారు ప్రకాష్ రాజ్. సీన్ సీన్‌కి ప్రేక్షకుడి మొహంలో హావభావాలు మారిపోతూ ఉంటాయి రాఘవరావు పాత్ర ద్వారా. ‘రంగమార్తాండ’ స్వర్ణ కంకణం చేతికి పడినప్పుడు అతని కళ్లల్లో నన్నుమించిన నటుడు లేడనే గర్వం.. అదే సందర్భంలో భార్య అవసరాలు తీర్చలేని.. మిత్రుడి హాస్పటల్ బిల్లు కట్టలేని అతని చేతకాని తనం.. కేవలం కళ్లతోనే నట విశ్వరూపం చూపించారు. రాజుగారూ! అంటూ భార్యని ప్రేమగా పిలిచే రాఘవరావు పిలుపు భలే గమ్మత్తుగా ఉంటుంది.
ప్రకాష్ రాజ్ చాలా బాగా చేశారంటే.. సర్లే కొత్తగా ఏదైనా చెప్పు బాస్ అంటారు చాలామంది. ఎందుకంటే.. ఆయనకి వచ్చిందే గొప్పగా చేయడం కాబట్టి. ఒక పాత్ర ప్రేక్షకుడ్ని ఇంతిలా ప్రభావితం చేయగలదా? అన్నంతగా తన అద్భుత నటనతో భావోద్వేగ ప్రయాణం చేయించారు. ఈ మహానటుడుకి జాతీయ పురష్కారాలు ఇవ్వరు (ఇది రీమేక్) కాబట్టి .. ఇస్తే మాత్రం ‘రంగమార్తాండ’కి సరైన గౌరవం దక్కినట్టే. . కోట్లాదిమందితో కీర్తింపబడిన తన భర్త.. కన్న బిడ్డలకు క్షమాపణ చెప్పినప్పుడు ‘నాకు నచ్చలేదండీ’ అని చెప్పే సన్నివేశంలో కళ్లతోనే జీవించేసింది రమ్యకృష్ణ. బంగారం.. బంగారం అని పెంచిన తన కూతురే.. కన్నతండ్రిని దొంగ అన్నప్పుడు.. భర్తచాటు భార్యగా ఉన్న రమ్యకృష్ణ ఒక్కసారిగా విజృంభించిన తీరు అద్భుతం. కేవలం కళ్లతోనే రమ్యకృష్ణ పలికించిన హావ భావాలు నభూతో న భవిష్యత్ అనేట్టుగానే ఉన్నాయి. పర్లేదులేవే.. మన కన్న కూతురే కదా.. నన్ను దొంగ అన్నది అని రాఘవరావు సర్దుకుపోయినా.. ‘మిమ్మల్ని దొంగ అన్నప్పుడే అది నా దృష్టిలో చనిపోయింది.. పదండి పోదాం’ అని ఈ భర్త చాటు భార్య చెప్పిన మాటకి కళ్లు చెమర్చకమానవు.
ఆహా.. ఇలాంటి భార్య కదా.. చివరి క్షణం వరుకు మనకు తోడుండాలి అని అనిపిస్తుంది. చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం.. విశ్వరూపం చూపించారు. తనలోని హాస్యబ్రహ్మ సైతం సైడ్‌కి జరిగి కళ్లు చెమర్చుకునేంత అద్భుతంగా బ్రహ్మానందం ఏడిపించేశారు. బ్రహ్మనందం.. ‘రంగమార్తాండ ముందు.. రంగమార్తాండ తర్వాత’.. అని చెప్పుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. హాస్య బ్రహ్మలో ఉన్న కొత్త నటుడ్ని ‘చక్రపాణి’ పాత్ర ద్వారా తిరిగి బతికించారు కృష్ణవంశీ. పద్మశ్రీ అనే జాతీయ పురస్కారానికి ఈ ‘చక్రపాణి’ అసలైన అర్హుడు అన్నంతగా మెప్పించారు హాస్యబ్రహ్మ. ఇక శివాత్మిక రాజశేఖర్ తన పాత్రలో సహజంగా, ఆకట్టుకునేలా పెర్ఫార్మ్ చేసారు. అలానే అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తమ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి అందించిన షాయరీ కథా నేపథ్యంలో వస్తూ హార్ట్ టచ్ చేస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు :
ఇళయరాజా అందించిన సాంగ్స్ ఈ సినిమాకు మంచి బలం. ఇళయరాజా గారి సంగీతం బాగుందని చెప్పడం చేపపిల్లకు ఈత పులిపిల్లకు వేట నేర్పినట్లుతుంది. ఎన్ని తరాలు మారినా. ఆ తరం ఈ తరం అనే గ్యాప్ రాణి ఇళయరాజా మ్యూజిక్ మ్యాస్ట్రోనే అనేంత అద్భుతంగా ‘రంగమార్తాండ’కి సంగీతం ఇచ్చారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్. ఈ మధ్య కాలంలో డైలాగ్లు తక్కువ..సైడ్ వెనకనుండి వచ్చే రణగొణ ధ్వనూలు ఎక్కువ. బరువైన మాటల్ని గుండెలకు హృద్యంగా అందించడంలో మ్యూజిక్ మ్యాస్ట్రో కాకలు తీరిన సంగీత యోధుడు అని మరోసారి నిరూపించారు. అన్ని సినిమాలకు మాటలు రాయడం ఓ లెక్క.. రంగ మార్తాండకి మాటలు రాయడం మరోలెక్క. ఎందుకంటే.. ఈ జీవన నాటకాన్ని నడిపించినది లోతైన మాటలే. ఆకెళ్ళ శివ్రసాద్ రాసిన ప్రతి డైలాగ్ చెవులు రెక్కించి వినేట్టుగా ఉంది.
రంగస్థలంపైన.. సాహిత్యంపైన.. ఈ నాటి ముందుతరం జనరేషన్ ఆలోచనలపైన ఎంత పట్టు ఉంటే ఇలాంటి పదాలు వస్తాయి. మొన్నటి తరం.. నిన్నటి తరం.. ఈతరం.. రేపటి తరం.. అన్ని తరాలకు అర్ధం అయ్యేట్టుగా అద్భుతమైన పద ప్రయోగాలతో ఆకెళ్ళ శివ్రసాద్ పెన్ పవర్ ‘రంగమార్తాండ’ని మరో మెట్టు ఎక్కించింది. సినిమా ఆరంభంలో రైటర్ లక్ష్మీ భూపాల ‘‘నేనొక నటుడ్ని!! అంటూ రాసిన కవితాగీతం అదరగొట్టాడు. ఇక ఈ సినిమా సృష్టికర్త కృష్ణవంశీ గత పదేళ్లుగా ఇండస్ట్రీలో పెద్దగా వినిపించలేదు. ఆయన డైరెక్షన్ వల్ల స్టార్లు అయిన స్టార్ హీరోలు సైతం.. కృష్ణవంశీతో సినిమా అంటే ముఖం చాటేసే పరిస్థితి. కానీ ‘రంగమార్తాండ’ సినిమా తరువాత కృష్ణవంశీ ఈజ్ బ్యాక్ అని కాలర్ ఎగరేసేట్టు చేశారు. ‘రంగమార్తాండ ముందు.. రంగమార్తాండ తరువాత’ అని కృష్ణవంశీ గురించి గొప్పగా చెపుతారు. అయన ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్య కృష్ణల వంటి మహానటులైన వల్లే సినిమా చూసి ఆశ్చర్య పోయి వుంటారు. మేము ఇంత గొప్ప నటులమా? అని, వాళ్లకు తెలియకుండానే అంతగా హావభావాలను పిండుకున్నాడు కృష్ణ వంశీ.
విశ్లేషణ:
మొత్తానికి రంగమార్తాండ రంగస్థల కళాకారుడి కధ. సాలిడ్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ కి గొప్ప నటీనటులు కలిసినప్పుడు, ఫలితం రంగమార్తాండ లానే ఉంటుంది. ముఖ్యంగా కృష్ణవంశీ ఈ సినిమాని అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ ఎమోషనల్ డ్రామా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్టా.. ఫట్టా అని కమర్షియల్ లెక్కల్ని పక్కనపెడితే.. ‘రంగమార్తాండ’ చూసిన తరువాత గొప్ప సినిమా చూశాం అని ప్రతి ప్రేక్షకుడు గొప్ప అనుభూతి పొందుతారు అనేది మాత్రం నిజం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.. ప్రతీ అమ్మ నాన్నలకు చూపించాల్సిన సినిమా. ఈ సినిమా చూసిన తరువాత.. ఒక్కసారైనా మన అమ్మనాన్నలకు క్షమాపణ చెప్పాలని అనిపిస్తుంది. అదే సందర్భంలో సంపాదించిన ప్రతి రూపాయి నా బిడ్డల కోసమే అనుకునే తల్లిదండ్రులు.. ఆ రూపాయిలో ఓ పది పైసలు మాకోసం కూడా అని జాగ్రత్త పడేట్టు చేశారు. ప్రశాంతంగా మన జీవితాలను అద్దం లో చేసుకుంటున్నట్లు కుటుంబం మొత్తంగా చూడదగ్గ మూవీ ఇది.