Pushpa 2 : సినిమాకెళ్తే తొక్కిసలాటలో మహిళ మృతి.. దోషులెవరు..?

తెలుగువాళ్లకు సినిమాలంటే ఎంత పిచ్చో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా సినిమాలకు, జనాలకు మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. అందుకే సినిమా వాళ్లు ఎక్కడ కనిపించినా వేలంవెర్రిగా ఎగబడిపోతుంటాం. వాళ్లు ఏం చెప్తే అది గుడ్డిగా చేసేస్తుంటాం. మంచిచెడు మరిచి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాం. తల్లిదండ్రుల మాటలను కూడా పెడచెవిన పెట్టి అభిమాన హీరో చెప్పాడని పిచ్చిపనులన్నీ చేసేస్తుంటాం.. సినిమాల ప్రభావం మన మెదళ్లపై ఆ స్థాయిలో ఉంటుంది మరి. అందుకే సినిమా వాళ్లకు కోట్లు రాలుతున్నాయి. మరి ప్రేక్షకులకు ఏం ఒరుగుతోంది..?
అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నెల రోజుల నుంచే ఈ సినిమా ప్రమోషన్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇండియన్ సినిమా రికార్డులన్నింటిని ఈ సినిమాతో బద్దలు కొట్టాలనే సంకల్పంతో పనిచేస్తోంది సినిమా యూనిట్. అందుకే తమ ముందున్న ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో విచ్చలవిడిగా ప్రమోషన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే జనాలు కూడా ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. టికెట్ రేట్లు భారీగా పెంచినా పట్టించుకోకుండా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్లో (Sandhya Theatre) అర్థరాత్రి హీరో అల్లు అర్జున్ అభిమానులతో కలిసి ఈ సినిమా చూసేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు (Allu Fans) పెద్దఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసులకు వీలుకాలేదు. థియేటర్ యాజమాన్యం కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ఇంతలో అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు ఓపెన్ టాప్ కారులో ప్రవేశించాడు. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. తొక్కిసలాట (stampede) జరిగింది. ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుమారుడు స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నాడు. సినిమా యూనిట్ మేమున్నాం.. ఆదుకుంటాం.. అని సందేశం పంపించింది.
అభిమానం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ పిల్లాడిని చావుబతుకుల్లోకి నెట్టేసింది. వాస్తవానికి ఈ పిల్లాడు అల్లు అర్జున్ కు వీరాభిమాని. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి కుటుంబమంతా థియేటర్ కు వచ్చింది. కానీ ఈ అభిమానం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అభిమానం ఉండొచ్చు తప్పు కాదు.. సినిమాకు వెళ్లొచ్చు.. నేరం కాదు.. కానీ దానికి ఓ సమయం సందర్భం ఉంటుంది. అర్ధరాత్రి పూట చిన్న పిల్లలను తీసుకుని అంత రష్ ఉన్న థియేటర్ కు వెళ్లకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అల్లు అర్జున్ పై అభిమానం ఉంటే ఇంకో సందర్బంలో చూడొచ్చు. కానీ ఇదే రోజు చూసి తీరాలని తీర్మానించుకోవాల్సిన అవసరం లేదు.
తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు.. లేదంటే ఏ హీరో (Hero) అభిమానులైనా కావచ్చు.. సినిమా తారలను అభిమానించడం తప్పు కాదు. కానీ వాళ్లకోసం ఇలా చావడమే కరెక్ట్ కాదు. మీ అభిమానం మాటున వాళ్లు కోట్లు వెనకేసుకుంటున్నారు. మరి మీకు ఏమైనా లాభముంటోందా..? ప్రతి ఒక్క అభిమానీ ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. ఏదైనా జరగరానిది జరిగితే మీ కుటుంబమంతా జీవితకాలం బాధపడాల్సి ఉంటుంది. సినిమా ఇప్పుడు కాకపోతే మరోసారి చూడొచ్చు. తొందరేం లేదు. కానీ మీ జీవితం చాలా ముఖ్యం.. మీరు మీ హీరోలను అభిమానించినట్లే.. మిమ్మల్ని అభిమానించే మీ కుటుంబసభ్యులు ఉంటారు.. స్నేహితులు ఉంటారు.. వాళ్లను కూడా మీరు అభిమానించండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.