RGV: మళ్లీ విచారణకు హాజరైన వర్మ..! కేసుల్లో కదలిక..!?
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి ఏపీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఆయన వ్యూహం (Vyooham) అనే సినిమా తీశారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్లను అవమానపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు రామ్ గోపాల్ వర్మ (RGV). దీనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ (Maddipadu PS) లో కేసు నమోదైంది. దానిపై ఇప్పటికే ఓసారి విచారణ జరిగింది. అప్పుడు కూడా చాలా సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకుండా తాత్సారం చేశారు. షూటింగ్స్ ఉన్నాయంటూ తప్పించుకున్నారు. చివరకు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. అయితే విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించడంతో విచారణకు హాజరు కాక తప్పలేదు.
తాజాగా మరోసారి విచారణకు రావాలని పోలీసులు కోరడంతో ఇవాళ ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పోస్టింగ్స్ వెనుక కారణాలను పోలీసులు ఆరా తీశారు. గతంలో విచారణకు హాజరైనప్పుడు వర్మ మొబైల్ ఫోన్ ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే తాను తీసుకు రాలేదని వర్మ తప్పించుకున్నారు. జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసినప్పుడు అది ఒంగోలు వైసీపీ ఆఫీసులో ఉన్నట్టు తేలింది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు వెళ్తే.. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ హడావుడి చేశారు. చివరకు ఫోన్ మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయారు పోలీసులు. ఇవాల్టి విచారణలో పోలీసులు ఫోన్ ను తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
గత విచారణలో వర్మ సహకరించలేదని పోలీసులు చెప్పారు. స్వతహాగా వర్మ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. అంత ఈజీగా చిక్కే రకం కాదు. ప్రతి దానికీ లాజిక్కులతో మేజిక్ చేస్తుంటారు. అలాంటి వర్మ ఇప్పుడైనా విచారణకు సహకరించారా అనేది తెలీదు. పోలీసులు విచారణలో తాము అనుకున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
వ్యూహం సినిమాకు అప్పట్లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (AP Digital Corporation) ద్వారా రూ.2 కోట్లు చెల్లించారు. అయితే ఆ స్థాయిలో ఆ సినిమాకు వ్యూస్ రాలేదు. దీంతో తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని, లేకుంటా చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని అప్పట్లో నోటీసులు ఇచ్చారు. మరి వర్మ డబ్బు చెల్లించారా లేదా అనేదానిపై సమాచారం లేదు. ఒకవేళ చెల్లించి ఉంటే దాని నుంచి వర్మ బయట పడినట్లే. ఒకవేళ చెల్లించకుండా ఉంటే మున్ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి వెంకట్ రెడ్డి తప్పుకున్న తర్వాత ఆ విషయంలో ప్రభుత్వం అంత సీరియస్ గా ఉన్నట్టు కనిపించట్లేదు.
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. వర్మ కేసులు ఏమయ్యాయంటూ చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వం చల్లబడిందని, ఇలాంటి కేసులు ఇంక మర్చిపోవడమేనని చాలా మంది సెటైర్లు కూడా వేశారు. అయితే ఇవాళ వర్మను మళ్లీ విచారణకు పిలవడంతో ఈ కేసుల్లో మళ్లీ కదలిక వచ్చినట్లు అర్థమవుతోంది.







