ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ: వీర మాస్ 'వీరసింహ రెడ్డి'

రివ్యూ: వీర మాస్ 'వీరసింహ రెడ్డి'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్,
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్,
హనీ రోజ్, నవీన్ చంద్ర, లాల్, అజయ్ ఘోష్ తదితరులు
సంగీత దర్శకులు: థమన్ ఎస్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, మాటలు: సాయి మాధవ్ బుర్ర, సి ఈ ఓ :చిరంజీవి (చెర్రీ)  
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు : గోపీచంద్ మలినేని
విడుదల తేదీ: 12.01.2023

నట సింహ నందమూరి బాలకృష్ణ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు చేశారు. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో తన నటనా విశ్యరూపం తో థియేటర్లలో విధ్వంసం సృటించిన ఆ సినిమాల్లో చాలావరకూ సంచలన విజయాలను సాధించాయి. ఆ తరహా కథలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన... మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్‌గా చూపించి మాస్‍ మసాలా ప్రియులకు రాగి సంకటి, నాటుకోడి పులుసు వంటి రుచి ని చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. బాలకృష్ణ తండ్రి కొడుకులుగా చేసిన ఈ సినిమా, ఆయన గత హిట్ చిత్రాల జాబితాలో చేరుతుందో లేదో  రివ్యూ లో చూద్దాం.

కథ :

'పులిచర్ల'లో వీరసింహారెడ్డి (బాలకృష్ణ)ని అక్కడి ప్రజలు దేవుడిలా భావిస్తుంటారు. అక్కడ ఆయన చెప్పిందే వేదం .. ఆయన ఆదేశమే శాసనం. అయితే వీరసింహారెడ్డి ఆధిపత్యాన్ని ప్రతాప రెడ్డి (దునియా విజయ్) సహించలేకపోతుంటాడు. అదను దొరికితే వీరసింహారెడ్డిని అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన తండ్రి చావుకి వీరసింహారెడ్డి కారకుడు కావడమే ప్రతాపరెడ్డి పగకు కారణం. అయితే ఎప్పటికప్పుడు వీరసింహారెడ్డి చేతిలో తన్నులు తిని ప్రతాప్ రెడ్డి తోకముడుస్తూ ఉంటాడు. ఆయన భార్య వీరసింహారెడ్డి  సొంత చెల్లెలు భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్). తన అన్నను చంపేసి రమ్మని ఆమె తన భర్తను రెచ్చగొట్టి మరీ అతనిపైకి పంపిస్తూ ఉంటుంది. ఒక మగాడిలా అతని 'తల' తెచ్చిన రోజునే మన శోభనం ఉంటుంది అని దూరం ఉంచుతుంది.  దాంతో అతను మరింత మందిని కూడగట్టుకుని వీరసింహారెడ్డిని అంతం చేయడానికి ట్రై చేస్తుంటాడు.

కట్ చేస్తే...  'ఇస్తాంబుల్' లో మీనాక్షి(హానీ రోజ్) ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది. ఆమె కొడుకే జైసింహా రెడ్డి( బాలయ్య). బిజినెస్ విషయంలో తల్లికి సహకరిస్తూ .. ఈషా (శ్రుతి హాసన్)తో ప్రేమలో పడతాడు. తమ ప్రేమ విషయాన్ని తన తండ్రి జయరామ్ (మురళి శర్మ)తో ఈషా చెబుతుంది. సంబంధం మాట్లాడుకోవడానికి ఆ తల్లీ కొడుకులు ఈషా ఇంటికి వెళ్లవలసిన సందర్భంలో ఆ రోజు, జై సింహారెడ్డితో అప్పటివరకు తెలియని నిజమ్ అతని తండ్రి వీరసింహారెడ్డి అని మీనాక్షి చెబుతుంది. జై సింహారెడ్డి నిశ్చితార్థానికి అతని తండ్రిని ఇస్తాంబుల్ కి పిలిపిస్తానని అంటుంది. వీరసింహారెడ్డి పులిచర్లలో ఉంటే మీనాక్షి ఎందుకు 'ఇస్తాంబుల్' లో ఉంటోంది. తన కొడుక్కి పెళ్లీడు వచ్చేవరకూ తండ్రి గురించి ఎందుకు చెప్పలేదు? వీరసింహారెడ్డి చెల్లెలు అతని శత్రువైన ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? అన్నయ్యపై ఆమె పగతో రగిలిపోయేంతగా ఏం జరిగింది? తన కొడుకు నిశ్చితార్థానికి ఇస్తాంబుల్ వెళ్లిన వీరసింహారెడ్డికి అక్కడ ఎలాటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేవి మిగతా కథలో చూడండి.

నటీనటుల హావభావాలు :

నట సింహ నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం గురించి కొత్తగా చెప్పేదేముంది? వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో నటించి ఎప్పటిలాగే తన నటనతో తన మాస్ యాక్టింగ్ తో ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లాంటి కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో తీవ్రమైన భావోద్వేగాలను పండించిన బాలయ్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. హీరోయిన్ గా నటించిన శ్రుతి హాసన్ తన గ్లామర్ తో తన పాత్రకు న్యాయం చేసింది. కానీ ఆ పాత్రకు వేరే హీరోయిన్ చేసినా చెప్పుకోడానికి ఇంపార్టెన్స్ ఏమి లేదు. హనీ రోజ్ తల్లిగా , వయసులో వున్నా అమ్మాయిగా నటన చాలా బాగుంది. ఆమె మంచి నటి అని ఈ సినిమా నిరూపించింది. ఇక ముఖ్యగా చెప్పాల్సివస్తే... వరలక్ష్మి శరత్ కుమార్ కి తన కెరీర్ లోనే ఇంత మంచి పాత్ర దొరుకుతుందో లేదో అలాంటి పాత్ర ఈ చిత్రంలో లభించింది. తన నటనతో కీలకమైన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ముఖ్యమైన సీన్ లో ఆమె నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ తన వైల్డ్ నటనతో మెప్పించాడు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి వరలక్ష్మి శరత్ కుమార్ కు చెప్పే సన్నివేశంలో దునియా విజయ్ నటన చాలా బాగుంది. మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర నిడివి తక్కువైనా ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మాస్ యాక్షన్ కథలపై ఆయనకి ఉన్న పట్టుకు నిదర్శనంగా కనిపిస్తుంది. కథ మొదటి నుంచి చివరి వరకూ కూడా తరువాత ఏం జరగనుందనే ఉత్కంఠను రేకెత్తిస్తూ వెళ్లాడు. ఇంటర్వెల్ సమయానికే సినిమా మొత్తం చూసేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక ఆ తరువాత చూపించడానికి ఏముంటుంది? అనే సందేహాం ఆడియన్స్ లో తలెత్తుతుంది. కానీ వీరసింహా రెడ్డితో ముడిపడిన వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ .. దునియా విజయ్ ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ ను రక్తి కట్టిస్తాయి. ఎక్కడా టెంపో తగ్గకుండా కథ అంచలంచెలుగా పైమెట్టుకు చేరుకుంటూ ఉంటుంది. కథ .. కథనం .. ట్విస్టులతో ప్రేక్షకులు జారిపోకుండా డైరెక్టర్ చూసుకున్నాడు. ఈ సినిమాలో బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్‌లు బాలయ్య నోట బుల్లెట్స్‌లా దూసుకుని వచ్చాయి.

అయితే కొన్ని డైలాగ్‌లు మాత్రం కథతో సంబంధం లేకుండా బాలయ్య పొలిటికల్ అజెండాని దృష్టిలో పెట్టుకుని రాసినట్టే అనిపిస్తాయి. ఓ మినిస్టర్‌ని ఉద్దేశించి చెప్పే సందర్భంలో.. ‘వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు.. గౌరవించడం మన బాధ్యత’ అని డైలాగ్ కొడతాడు. ఇలా ఏ పి ప్రభుత్వాన్నికెలికే  డైలాగ్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి చెప్పిన డైలాగ్. ‘‘ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు., జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు., పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు., నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు., పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో.. వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలౌడ్..’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అధికార పార్టీ కెలికినట్టే ఉంటుంది. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర స‌ృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు. బలం చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువా..’  ‘మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా’.. లాంటి డైలాగ్‌లు కూడా అధికార పార్టీపై ఎక్కుపెట్టిన బాణాల్లాగే అనిపిస్తుంది.  బలమైన కథాకథనాలతో ముందుకు వెళుతున్న ఈ సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఊతాన్ని ఇచ్చాయని చెప్పచ్చు. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. రిషి పంజాబి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. ఫైట్స్ లోను .. పాటల చిత్రీకరణలోను ఆయన పనితనం మరింత కనిపిస్తుంది.

ఈ కథలో మంచి స్క్రీన్ ప్లే ఉంది .. దానిని తేలికగా అర్థం చేసుకునే విధంగా నవీన్ నూలి ఎడిటింగ్ ఉంది. రామ్ లక్ష్మణ్ .. వెంకట్ ఫైట్స్ కొత్తగా అనిపిస్తాయి. షర్టు జేబుల్లో నుంచి చేతులు బయటికి తీయకుండా చేసే జూనియర్ బాలయ్య ఫైట్ ను .. కుర్చీలో నుంచి లేవకుండా సీనియర్ బాలయ్య చేసే ఫైట్ ను  బాగా కంపోజ్ చేశారు. కొరియోగ్రఫీ కూడా మంచి మార్కులు కొట్టేసింది. సిగరెట్ తాగుతూ .. గోలీ సోడా తాగుతూ బాలయ్యతో వేయించిన స్టెప్పులకు విజిల్స్ పడతాయి.

విశ్లేషణ:

బాలయ్య  ఫ్యాక్షనిజం బాట పట్టి తన చుట్టూ ఉన్న వాళ్లని దారి మళ్లించి మార్పుకి శ్రీకారం చుట్టడం బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల్లో సారాంశం. అయితే ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్‌ని మాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని వాళ్ల కోసం అందించిన ఊర మాస్ బిర్యానీలా అనిపిస్తుంది. నటసింహం బాలయ్య తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. ఆకలితో ఉన్న సింహాన్ని కొన్నాళ్లు బోనులో బంధించి.. ఒక్కసారిగా వేటకి వదిలితే ఎలా ఉంటుందో.. ‘వీరసింహారెడ్డి’ విశ్వరూపం అలా ఉంది. ఫ్యాన్స్‌తో ఈలలు కొట్టించే ఎలివేషన్ సన్నివేశాలు అడుగడుగునా ఉంటాయి. హీరోయిజం ఎలివేషన్ సీన్లలో బాలయ్య వీరంగం చేశాడు. దర్శకుడు. కేవలం ఫైట్‌లు.. యాక్షన్.. ఎలివేషన్స్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు దర్శకుడు గోపీచంద్. ఫ్యాక్షన్ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్‌ని సరిగా ఎలివేట్ చేయలేకపోయారు దర్శకుడు. బాలయ్యని ఒకప్పటి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు గెటప్‌లో చూపించినా.. ఆ సినిమాల స్థాయి కథని అయితే అందించలేకపోయాడు గోపీచంద్. బాలయ్యకి కత్తి ఇచ్చి నరికిస్తే ప్రేక్షకులే చూసుకుంటారని అనుకున్నారో ఏమో కానీ.. అవసరం ఉన్న లేకపోయినా ఫైట్లు పెట్టి.. రక్తపాతం సృష్టించారు. ప్రతినాయకుడు ఎన్ని వేట్లు వేసినా అడ్డదిడ్డంగా నరుక్కుంటూ పోయినా.. లెక్కచెప్పాల్సిన పని ఉండదు. ఎందుకంటే అతను విలన్ కాబట్టి.. కానీ కథలో నాయకుడు అనేవాడు వేసే ప్రతి వేటుకి ప్రేక్షకుడికి లెక్క చెప్పాల్సిందే. కానీ ‘వీరసింహారెడ్డి’లో లెక్కచెప్పలేనన్ని వేట్లు పడ్డాయి.  కుర్చీలో కూర్చిన తాపీగా చుట్టకాలుస్తూ.. తలకాయల్ని తెగ తరిగేశాడు బాలయ్య. ఫస్ట్ రీల్ నుండి క్లైమాక్స్ వరకు వీర నరుకుడే నరుకుడు. బాలయ్య అభిమానులకు మంచి ఫీస్ట్.  

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :