ASBL NSL Infratech

కాంగ్రెస్ మేనిఫెస్టో..న్యాయపత్రం..

కాంగ్రెస్ మేనిఫెస్టో..న్యాయపత్రం..

తెలంగాణ వేదికపై నుంచి సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించింది కాంగ్రెస్. తుక్కుగూడలో ఇచ్చిన హామీలను తెలంగాణలో అమలుచేస్తున్నట్లే.. దేశానికి ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్. జన జాతర సభ వేదికగా ‘న్యాయ పత్రం’ పేరుతో కాంగ్రెస్‌ రూపొందించిన జాతీయస్థాయి మేనిఫెస్టోను రాహుల్ విడుదల చేశారు.

ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయి. యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 ఇస్తాం. మహిళా న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తాం. వాటిని నేరుగా బ్యాంకులోనే జమ చేస్తాం. ఇది ఓ విప్లవాత్మక పథకం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదన్నారు రాహుల్.. అదే సమయంలో మోడీ సర్కార్‌పైనా రాహుల్ విరుచుకుపడ్డారు.

మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతుకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. స్వామినాథన్‌ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర ఇస్తాం. జాతీయస్థాయిలో కనీస వేతనం రూ.400కి పెంచుతాం. ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచుతాం. దేశంలో 50శాతం జనాభా బీసీలుండగా...8శాతం ఎస్టీలు, 15శాతం మంది మైనార్టీలు ఉన్నారు. మొత్తంగా 90శాతం పేదలే ఉన్నారు. దేశంలో ఏ సంస్థలో చూసినా ఈ 90శాతం మంది కనిపించరు. దేశంలోని 90 మంది ఐఏఎస్‌ అధికారులు ఉంటే ముగ్గురే బీసీలు. జనాభాలో ఓబీసీలు 50శాతం.. ఐఏఎస్‌ల్లో ఓబీసీల వాటా 3 శాతం మాత్రమే ’’ అని రాహుల్‌ అన్నారు.

కాంగ్రెస్‌ అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని, ఇదే పార్టీ అభిమతమని చెప్పారు. మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీ ఉంటే.. కాంగ్రెస్‌ వద్ద ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం వేలాది ఫోన్లను ట్యాప్ చేసిందని.. మాజీ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగం చేశారని విరుచుకుపడ్డారు. అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు... ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల డేటాను నాశనం చేశారని ఆరోపించారు.. తెలంగాణలోని తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణలోని బీజేపీ-బీ టీమ్‌ని ఓడించామని, ఇక ఏ టీమ్‌ని ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు రాహుల్. తుక్కుగూడ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఓవైపు బీఆర్ఎస్ పతనావస్థకు చేరుతోందన్న అంచనాలు.. ఇంకా పుంజుకోని బీజేపీ.. వెరసి సార్వత్రిక ఎన్నికల్లోతమకు తిరుగులేదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :