ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దత్తపీఠంలో ఘనంగా జరిగిన మహోత్సవాలు

దత్తపీఠంలో ఘనంగా జరిగిన మహోత్సవాలు

మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్తజయంతి పర్వదినము. అవధూత దత్తపీఠాధిపతి (మైసూర్‌, ఇండియా) పరమపూజ్య శ్రీ శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీవారు ఈ దత్త జయంతిని 3 రోజుల ఉత్సవంగా పీఠంలో ఆచరిస్తారు. ఈ 3 రోజులకి ముందుగా వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి మరియు గీతాజయంతి.

ఈ శోభకృత్‌ నామ సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి, డిశెంబర్‌ 23వ తేదీ ముక్కోటి ఏకాదశి అయినది. ఆ రోజు తెల్లవారు జామున దత్తపీఠంలోని శ్రీదత్త వేంకటేశ్వర స్వామి దేవాలయములో శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఉత్తరద్వార దర్శనము ఏర్పాటు చేయబడినది. ఆ సమయములో వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ దత్తవేంకటేశ్వర స్వామిని, పూజ్య శ్రీస్వామిజీ వారిని దర్శించుకుని, తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. 

ఆరోజే గీతాజయంతి పర్వదినము కూడా శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునికి వేదవిజ్ఞాన సారాన్ని అందించి, జీవిత పరమావధి గురించి జ్ఞానోదయము చేసిన రోజు గీతాజయంతి. ఈ సందర్భంగా ఉదయం 10 గం.లకి నాదమండపంత్‌ పూజ్య అప్పాజీ, శ్రీబాలస్వామిజీ వారి దివ్య సమక్షంలో భక్తులందరు కలిసి సంపూర్ణ భగవద్గీతాపారాయణం చేసి, శ్రీ స్వామిజీ వారి అనుగ్రహాన్ని పొందారు.  

24వ తేదీ హనుమాన్‌ జయంతి. పీఠంలో వెలిసి ఉన్న శ్రీ కార్యసిద్ధి హనుమాన్‌కి పూజ్య శ్రీ స్వామిజీ వారు అభిషేకము, అర్చన చేసి, హారతులు ఇచ్చారు. ఆ సందర్భంలో పూజ్య శ్రీ స్వామిజీ మాట్లాడుతూ హనుమంతుడే మన ఊపిరి, మన ప్రాణము. హనుమంతుని ఎల్లవేళలా తలచిన వారికి భయముండదు అని చెప్పారు.  ఈ రోజు దత్తజయంతి మొదటిరోజు. ఈ రోజు దత్తాత్రేయ హోమానికి పూర్ణాహుతిని సమర్పించి పూజ్య శ్రీ స్వామిజీ దత్తాత్రేయునికి పంచామృత అభిషేకమును నిర్వహించారు. 25వ తేదీ దత్తజయంతి రెండవ రోజు. ఉదయం శ్రీస్వామిజీ శ్రీచక్రార్చన చేసి, దత్తమూర్తికి క్షీరాభిషేకము నిర్వహించారు. సాయంత్రం 5 గం.లకి ఆశ్రమంలో దత్తాత్రేయునికి రథోత్సము జరిగినది. దత్త జయంతి 26వ తేదీ ప్రధానమైన రోజు దత్త జయంతి మూడవరోజు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల అంశంతో శ్రీమూర్తి రూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే దత్తావతారము.  

డిసెంబరు 26వ తేదీన ఉదయం 9 గం.లకి శ్రీస్వామిజీ శ్రీ చక్రపూజ చేసి, పవమాన హోమానికి పుర్ణాహుతిని సమర్పించారు. స్వర్ణ దత్తాత్రేయ స్వామికీ అర్చన చేసి, శ్రీస్వామిజీ భక్తులకు సందేశంలో అందరూ తమ హృదయంలో నేనే దత్తుడిని అనే సంపూర్ణమైన నమ్మకంతో ఉండాలన్నారు.  తరువాత 10 గం.ల నుండి దత్తాత్రేయ మూర్తికి సహస్ర కలశ తైలాభిషేకాన్ని భక్తులందరూ నిర్వహించుకున్నారు. సాయంత్రం 7 గం.లకి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న సప్తర్షి సరోవరంలో పూజ్య శ్రీస్వామిజీ దత్తాత్రేయ మూర్తికి తెప్సోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.  తరువాత 8 గంటలకి నాదమంటపం లో శ్రీస్వామిజీ దత్తాత్రేయ స్వామికి కాగడాహారతులు సమర్పించారు. 

28వ తేదీ ఉదయం 8 గం.లకి, ముందుగా పాండలీక రంగస్థలములో వేదిక మీద వేదపండితులు హోమము చేసి, పూర్ణాహుతిని సమర్పించారు. తరువాత వేదపారాయణలు, మంగళ వాయిద్యముల నడుమ పూజ్యశ్రీ స్వామిజీ శిరస్సు మీద కలశం ధరించి, నూతన ఆలయంలో ప్రతిష్టింపబడిన 200 సాలగ్రామములకు ప్రదక్షిణ చేసి, వాటిని ఆవిష్కరించారు. ఆ శ్రీహరి సన్నిధికి, మొదటి అర్చన చేసి, 200 సాలగ్రాములకు పూజల చేసి హారతులు ఇచ్చారు.  

శ్రీరాజరాజేశ్వరీ మాత ప్రతిష్ఠ. ఇదివరకు దత్తాత్రేయ మూర్తి ఉన్న ఆలయము ఇప్పుడు శ్రీమాతకి నిలయమైనది.  28వ తేదీ 12:20 నిమిషములకు ముందుగా నూతన ఆలయంలో యంత్ర ప్రతిష్ట చేసి, అమ్మవారిని ప్రతిష్టించారు. శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారి మూర్తి ఎంతో సుందరంగా ఉన్నది. అద్భుతమైన శోభతో మెరిసిపోతున్నది.  వేదపండితులు  అమ్మవారి వేదస్తోత్రములు పఠిస్తూ ఉండగా, పూజ్య శ్రీస్వామిజీ ఆలయ శిఖరాగ్రం మీదకు ఎక్కి శిబిరానికి కుంభాభిషేకం చేశారు. పుష్పాలతో అర్చన చేశారు. తరువాత ఆ శిఖరంపై నుండి శ్రీస్వామిజీ తమ దివ్య సందేశాన్ని అనుగ్రహించారు. ఆలయంలోని అమ్మవారికి అభిషేకము చేశారు. సాయంత్రం 6 గం.కి శ్రీ స్వామిజీ శ్రీమాత ఆలయంలో, శ్రీలలితా సహస్రశామ లేఖను పుస్తకాలకు పూలతో పూజచేసి, హరతులిచ్చి, వాటిని శ్రీమాతకు సమర్పించారు.  దేశ, విదేశాలలోని భక్తులందరూ, 5, 6 నెలల నుండి ఈ లలితా సహస్ర నామ లేఖన పుస్తకాలను ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రాసి ఉన్నారు. ఈ పుస్తకముల సంఖ్య లక్షా ఇరవై వేలు.  ఈ విధంగా 12 కోట్ల నామాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ ప్రకారం దత్తపీఠంలో శ్రీరాజరాజేశ్వరీ మాత ప్రతిష్ఠా కార్యక్రమాలు మహావైభవంగా జరిగాయి.

శ్రీ మాత్రమే నమ:

- సుందరి చెన్నూరి

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :