ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్నికల బరిలో 9 మంది ముఖ్యమంత్రుల వారసులు..! అదృష్టం ఎలా ఉందో..?

ఎన్నికల బరిలో 9 మంది ముఖ్యమంత్రుల వారసులు..! అదృష్టం ఎలా ఉందో..?

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి పలువురు వారసులు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని వైసీపీ, టీడీపీ అధినేతలు గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే కొంతమంది వారసులకు మాత్రం మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసివారి వారసులు పలువురు ఈసారి రేసులో నిలుస్తున్నారు. దాదాపు 9 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బరిలో నిలుస్తున్నారు. కడప ఎంపీగా 2 సార్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి, 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షనాయకుడయ్యారు. 2019లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తండ్రి మరణానంతరం వైసీపీలో షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ అరెస్ట్ అయిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అనంతరం కుటుంబ తగాదాల నేపథ్యంలో ఏపీని వదిలి తెలంగాణలో పార్టీ పెట్టారు. ఇటీవల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టారు. కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగనున్నారు.

టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కుమారుడు బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యే రేసులో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచారు బాలయ్య. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి ఇప్పుడు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. ప్రస్తుత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి ఓడిపోయిన లోకేశ్.. ఈసారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నారు. వైఎస్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీ తరపున వెంకటగిరి నుంచి బరిలో ఉన్నారు. ఈయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. గతంలో తల్లి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి కుమారుడు కాసు మహేశ్వర్ రెడ్డి గురజాల నుంచి వైసీపీ తరపున పోటీలో ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. గతంలో సూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరి ఈ ముఖ్యమంత్రుల వారసుల అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే జూన్ 3 వరకూ ఆగాల్సిందే..!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :