ASBL NSL Infratech

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాభమా..? నష్టమా..?

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాభమా..? నష్టమా..?

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతాయని.. తమకు తెలియకుండానే వేరే వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉంటుందని జనం భయపడుతున్నారు. భూ వివాదాల కోసం సివిల్స్ కోర్టులను ఆశ్రయించకుండా చేయడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారుతుందని.. ట్రైబ్యునళ్లను ఆశ్రయించాల్సి రావడంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

పైలట్ ప్రాజెక్టుగా...

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌-2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసిన ఈ 16 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్లకు బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వివాదం రాజుకుంటోంది. దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

వేేరేవారి చేతుల్లోకి పోయే ప్రమాదం..?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా పట్టాదారు పాస్ బుక్, అడంగల్ లాంటి రెవెన్యూ రికార్డులు ఎందుకు పని రాకుండా పోతాయని.. ఈ ఆధారాలు ఏవీ లేకుండాపోతే.. భూములు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల దగ్గర్నుంచి భూములను చట్ట ప్రకారం కొట్టేయడానికి వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.. తాము అధికారంలోకి వచ్చాక ఈ చట్టం లేకుండా చేస్తామని విపక్ష కూటమి చెబుతోంది.

99 శాతం భూసమస్యలు పరిష్కారమవుతాయన్న ప్రభుత్వం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ విషయంలో ప్రభుత్వ స్పందన మరోలా ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే 99 శాతం భూవివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి.. ఇలా అన్ని రకాల భూములకు సంబంధించి ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుందని సర్కారు వివరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో భూములకు సంబంధించి 30కిపైగా రికార్డులున్నాయి. అయితే ఈ రికార్డుల్లో పేరున్నా.. వేరే వ్యక్తులు భూమి తమదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని.. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూమి యజమానులకు భరోసా వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారని.. అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారని.. వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించొచ్చని భరోసా ఇస్తోంది..అయితే...ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అని.. భూ వివాదం కారణంగా భూములను కోల్పోయే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదైన తర్వాత.. రెండేళ్లలోపే అభ్యంతరాలు వ్యక్తం చేయాలని.. ఒకవేళ రెండేళ్లలోపు అభ్యంతరాలేవీ లేకపోతే.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదనడం ఆందోళనలకు కారణమవుతోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :