Jagan: కాంగ్రెస్ పై జగన్ ఫోకస్.. ఇకనైనా లెక్కలు మారుతాయా?

జగన్ యాక్టివ్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి గల కారణాలపై లోతుగా పరిశీలన జరిపిన ఆయన, పార్టీకి పునర్వ్యూహరచన చేపడుతున్నారు. ఇందులో భాగంగా నాయకుల్లో మార్పులు, సీనియర్లకు ప్రాధాన్యత, బలమైన వ్యక్తుల పార్టీ ప్రవేశాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
జగన్ ప్రస్తుతం బెంగళూరు (Bangalore) కేంద్రంగా తన కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ మార్పుపై సిద్ధంగా ఉన్న నాయకులను గుర్తించి వారిని వైసీపీలోకి తీసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతోంది. కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలు, వారి సామాజిక గుర్తింపు ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు.
ఇటీవల తూర్పు గోదావరి (East Godavari) జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నేత జగన్ తో ప్రత్యక్షంగా మాట్లాడి తన వారసుడిని వైసీపీలో చేర్చే అంశంపై చర్చించారట. జగన్ ఆయన్ను కూడా పార్టీలోకి రావాలని సూచించగా, ఆ నేత అంగీకరించినట్లు సమాచారం. అదే విధంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేతో, ఇప్పటికే వైసీపీలో చేరిన సాకే శైలజానాధ్ (Sake Sailajanath) చర్చించి, అనంతరం ఆయనను జగన్ తో మాట్లాడించినట్లు సమాచారం.
ఇంకా, 2024 ఎన్నికల్లో చీరాల (Chirala) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్ (Amanchi Krishna Mohan) కూడా తిరిగి వైసీపీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన నుంచి అవకాశం రాకపోవడంతో ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, పార్టీలోకి రావడంపై దాదాపు స్పష్టత వచ్చింది.
ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మరికొందరు కీలక నాయకులు కూడా ఆగస్టు 15 (August 15)న వైసీపీలో చేరనున్నారు. వీరిలో ముగ్గురు నేతలు ఇప్పటికే పార్టీ నేతలతో చర్చలు ముగించి, జగన్ తో భేటీకి సిద్ధమవుతున్నారు. అనంతపురం (Anantapur) జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్ . ఇటు, సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన సుగవాసి బాల సుబ్రమణ్యం (Sugavasi Bala Subrahmanyam) ఇప్పటికే వైసీపీలోకి వచ్చారు. జగన్ ప్రారంభించిన ఈ ‘ఆపరేషన్ కాంగ్రెస్’ ద్వారా కాంగ్రెస్ ఓట్ల ప్రభావాన్ని తగ్గించి, వచ్చే ఎన్నికలకు బలంగా తలపడాలన్నది లక్ష్యంగా ఉంది. ఇందుకోసం ఆయన రాజకీయ తంత్రాన్ని మారుస్తూ, బెంగళూరులో నుంచి కీలక నేతలతో సంబంధాలు కుదురుస్తున్నారు.