Pawan Kalyan: పవన్ సార్ ఇచ్చిన మాట సంగతి ఏంటి..అంటున్న గిరిజనులు..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల్లో, ముఖ్యంగా గిరిజనుల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏ పని చేపట్టినా నిబద్ధతతో పూర్తి చేస్తారని నమ్మకం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, హామీ ఇచ్చిన పనిని పూర్తి చేస్తారని ఆశాభావంతో గిరిజనులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) లోని అనంతగిరి మండలం (Ananthagiri Mandal) ప్రజలు గతంలో ఆయనపై పెట్టుకున్న ఆశలే ఇప్పుడు నిరాశకు గురయ్యాయి.
ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కళ్యాణ్ మడ్రేబు (Madrebu), దాయర్తి (Dayarthi) వంటి గిరిజన గ్రామాలను సందర్శించారు. అక్కడి వారు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ఆయన ఆరా తీశారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైన గిరిజనులు దైర్యంగా చెప్పిన సమస్యల్లో రహదారి సమస్య అతి ముఖ్యమైనది. పర్వత ప్రాంతాల్లో నివసించే వీరికి డోలీల్లోనే తరలివెళ్లాల్సిన దుస్థితి ఉంది. ఈ బాధను తెలుసుకున్న పవన్, గిరిజనుల కోసం మెరుగైన రహదారులను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
గుమ్మంతి-రాచకీలం (Gummanti-Rachakeelam), రాచకీలం-రెడ్డిపాడు (Rachakeelam-Reddipadu), బల్లగరువు-వాజంగి (Ballagaruvu-Vajangi), పీచుమామిడి-గుమ్మంతి (Peechumamidi- Gummanti) మార్గాల్లో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అధికారులకు స్పష్టంగా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే శంకుస్థాపన జరిగి ఆరు నెలలు దాటినా, ఒక్క పనిని కూడా చేపట్టలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పినకోట (Pinakota), పెదకోట (Pedakota), జీనబాడు (Jeenabadu) పంచాయతీల పరిధిలోని పీవీటీజీ (PVTG) గిరిజనులు నిరసన చేపట్టారు. ‘పవన్ సార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. తమ గ్రామాలకు సరైన రహదారి లేక, ఆసుపత్రి, విద్య వంటి అవసరాల కోసం బయటికి వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. తాము పవన్‌ను నమ్మి సంతోషపడ్డామని, కానీ ఇచ్చిన హామీపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం బాధించేదిగా ఉందని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేకించి పర్వతాలలో నివసించే వీరి సమస్యలు చిన్నవి కాదు..డోలీల్లో మృతదేహాలను మోయడం, గర్భిణీలను ఆసుపత్రులకు తరలించడంలో ఎదురయ్యే ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. అలాంటపుడు ఇచ్చిన హామీ పై చర్యలు లేకపోవడం గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పవన్ స్పందించి పునః పరిశీలించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.