Bhumana Karunakar Reddy: భూ వివాదంలో భూమన.. వేడెక్కుతున్న తిరుపతి రాజకీయాలు..
వైసీపీ (YCP) సీనియర్ నేత, తిరుపతి (Tirupati) మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయనపై భూమి సంబంధిత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరఫున ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. మొదటగా, హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ దేవస్థానం ఆధ్వర్యంలో ఒక కేసు నమోదైంది.
ఇంతకుముందు అలిపిరి (Alipiri) ప్రాంతంలోని గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ భూమన యాగం చేసినట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ వార్తలపై అధికారుల నుంచి వెంటనే స్పందన వచ్చింది. అసత్య ప్రచారం చేశారంటూ మరొక కేసు అప్పట్లో దాఖలైంది. ఈ రెండు ఘటనల తర్వాత భూమన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
ఈసారి వ్యవహారంలో రెవెన్యూ శాఖ రంగంలోకి దిగింది. తిరుపతి ప్రాంతంలో భూమన కొనుగోలు చేసిన స్థలాల్లో కొంత భాగం శ్రీకాళహస్తి (Srikalahasti) దేవాలయానికి చెందిన భూములు కూడా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అందులో ఉన్న భూములను అక్రమంగా కలుపుకొని వినియోగించారని స్థానికంగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) దృష్టికి తీసుకెళ్లిన అనంతరం, ఆయన ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు.
రెవెన్యూ శాఖ చేసిన దర్యాప్తులో సుమారు రెండు ఎకరాల భూమి దేవాలయానికి సంబంధించినదే అని తేలినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి డీఎస్పీ (Tirupati DSP) మీడియాతో మాట్లాడుతూ, భూమనపై కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నామన్నారు. అయితే ఇది సివిల్ అంశం కావడంతో కోర్టు ఎలా స్పందించాలి అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
భూమనపై గతంలో కూడా వివిధ వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఆయనపై వచ్చిన భూవివాద ఆరోపణలు అధికారికంగా విచారణకు లోనవ్వడం, అది పోలీస్ కేసు దశకు చేరుకోవడం విశేషం. దీనిపై వైసీపీ వర్గాలు స్పందించాల్సి ఉంది. ఇక భూమన స్పందన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







