ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

విజయవాడలో ఘనంగా 'తానా' రాజధాని కళోత్సవం

విజయవాడలో ఘనంగా 'తానా' రాజధాని కళోత్సవం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) తెలుగువారి సంప్రదాయ, కళారూపాల పరిరక్షణలో చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు అన్నారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా తానా రాజధాని కళోత్సవం కార్యక్రమాన్ని జనవరి 8వ తేదీన మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో  నిర్వహించారు. రాష్ట్ర సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి జ్యోతి వెలిగించి కళాత్సోవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విశ్రాంత డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ మాతృభూమి  వదిలి పొరుగు దేశంలో ఉన్న మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేసి తానా  విద్యాప్రగతిలో భాగస్వామి అవుతోందని చెప్పారు.

తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో ఎన్‌ఆర్‌ఐలు జన్మభూమికి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ తానా సభలకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆహ్వానించడంతో పాటు ఇక్కడకు రావడం ఓ ఆత్మీయ కలయికగా ఉందని పేర్కొన్నారు.

తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన మాట్లాడుతూ అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారిఒకి ఆపద కలిగినప్పుడు అదుకోవడంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, తానా ప్రధాన కార్యదర్శి లావు అంజయ్య చౌదరి, కోశాధికారి రవి పొట్లూరి, తణుకు ఎమ్మెల్యే ఎ.రాధాకృష్ణ, గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం, అమరావతి బోటింగ్‌ క్లబ్‌ చైర్మన్‌ తరుణ్‌ కాకాని, తానా సభ్యులు దేవినేని లక్ష్మి, విజయలక్ష్మి, ఈవెంట్స్‌ కో ఆర్డినేటర్‌ రాజా సూరపనేని తదితరులు పాల్గొన్నారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బుర్ర కథ, జానపద పాటలు, శాస్త్రీయ నృత్యాలు, సిద్ధార్థ మహిళ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన నాటికలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తానా సేవలపై జాన్‌ రచించి ఆలపించిన సీడీనీ ఆవిష్కరించారు. తానా కళోత్సవం అందరినీ మైమరపింపజేసింది.

Click here for Event Gallery

 

Tags :