ASBL NSL Infratech

తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటేలా ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు

తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటేలా ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు

తెలంగాణకు వన్నె తెచ్చిన వైతాళికులను గుర్తుచేస్తూ, తేజోమూర్తులు ప్రపంచించిన మంచిమాటలను వ్యక్తీకరిస్తూ ప్రపంచ తెలుగు మహాసభల సంరంభాన్ని నిర్వహించేందుకు రాజధాని నగరం సంసిద్ధమైంది. తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.  డిసెంబర్‌ 15 నుంచి 19వ తేదీ వరకు ఈ మహాసభలు జరగనున్నాయి. డిసెంబర్‌ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఈ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్‌ సిహెచ్‌. విద్యాసాగర్‌రావు, గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. తెలంగాణలో జన్మించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన డాక్టర్‌ రాధారెడ్డి-రాజారెడ్డి కూచిపూడి శైలి నృత్యకళారూపాన్ని ప్రదర్శించనున్నారు. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరవుతున్నారు.

తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక కళావికాసాలను విలక్షణతలను, సంప్రదాయ విలువలను, చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచపటం మీద ఎగురవేయడమే లక్ష్యంగా ఈ ప్రపంచ మహాసభలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఉన్న భాష సహజమైన భాష తెలంగాణలోని సాహిత్యానికి 2000 సంవత్సరాలకన్నా ఎక్కువ చరిత్ర కలిగి ఉందన్న విషయాన్ని మహాసభల వేదిక ద్వారా తెలియజేయనున్నారు. కందపద్యాలు తెలంగాణలోనే పుట్టాయి. తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఎక్కువగా విరసిల్లింది తెలంగాణలోనే అన్న విషయాన్ని అందరికీ తెలియజెప్పాలన్నదే ఈ సభల ఉద్దేశ్యం.

ఈ మహాసభల కోసం వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులను, తెలుగు భాషాభిమానులను ఆహ్వానించారు.  రాష్ట్రంలో ఉన్న సాహితీ, భాషావేత్తలను కూడా మహాసభలకు ఆహ్వానించారు.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగి ప్రయత్నంపై చర్చాగోష్టులను నిర్వహించారు. తెలంగాణలో వర్థిల్లిన తెలుగును ప్రపంచం నలుమూలలకు తెలిపే విధంగా కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. గోల్కొండ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయనున్నారు. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో చోటు చేసుకోనున్నాయి.

ఎల్‌బి స్టేడియం ప్రధాన వేదికగా తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలితకళాతోరణం, నిజాంకాలేజీ గ్రౌండ్స్‌, భారతీయ విద్యాభవన్‌, పింగళివెంకట్రామరెడ్డి హాల్‌, శిల్పకళావేదిక తదితర ప్రాంతాల్లో మహాసభల కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం సాహిత్యగోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి, ఆటలు, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మలాంటి పాటలు, వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉంటాయి. తానీషా-రామదాసు సంబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయాణం, శారదకారులు, హరికథ ప్రక్రియ తదితర అంశాలను ఇందులో ప్రదర్శిస్తారు. పద్యగానం, సినీపాటల విభావరి కూడా ఉంటుంది. చుక్క పొడుపు నుంచి పొద్దుగూకే వరకు గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే నాట్ల పాటలు, కోత పాటలు, దుక్కిపాటలు, జానపదగేయాలు వంటి అంశాలను కూడా ఈ మహాసభల్లో ప్రదర్శించనున్నారు. వివిధ రకాల నాటక ప్రక్రియలు అంటే ఆదివాసి, గిరిజన, శాస్త్రీయ, జానపదనృత్యాలు లాంటివి కూడా మహాసభల్లో ప్రదర్శించనున్నారు. మహిళలు పాడే పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక తరం నుంచి మరోతరానికి ఎలా అందజేయడం జరిగిందో కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు.

స్వాగత ద్వారాల స్తంభాలు

హైదరాబాద్‌ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు పర్యాటశాఖ, పౌరసంబంధాలశాఖ, నగర పాలకసంస్థలు ఏర్పాట్లు చేశాయి. దేశ, విదేశాలనుంచి వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌ నగరానికి దారితీసే అన్ని ప్రధాన రహదారులపై మొత్తం 60 స్వాగత ద్వారాలు కనిపిస్తాయి. ఒక్కో స్వాగత ద్వారానికి ఒక్కో కవి, రచయిత కళాకారుల పేర్లు పెడుతున్నారు. శాతవాహనుల నుంచి అసఫ్‌జాహీల వరకు పాలించిన పాలకులు ప్రోత్సహించిన నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా వీటిని రూపొందిస్తున్నారు. ఈ స్వాగత ద్వారాల స్తంభాలు తెలంగాణలోని ప్రాచీన కట్టడాల స్తంభాలను పోలి ఉండేలా ఇవి ఉంటాయి.

తోరణానికి ఇరువైపులా ప్రసిద్ధ కట్టడం నమూనా (టాబ్లో) ఉంటుంది. మధ్యభాగంలో ఒక కవి చిత్రంతో పాటు ఆయన రచనల్లోని పంక్తులు మనలను ఆకట్టుకుంటాయి. వీటిలో నిజామాబాద్‌ నీలకంఠేశ్వర ఆలయస్తంభం దాని పైభాగంలో దేవరకొండ ఆలయ నమూనాతో ఓ స్వాగతం ద్వారం రూపొందించారు. జటప్రోలులోని మాదనన ఆలయ స్తంభాలపై అలంపూర్‌ పాపనాథ ఆలయ శిల్పకళాతోరణం, దానిపై గద్వాల రాజమహల్‌ను పోలిన మరో స్వాగత ద్వారం, కూసుమంచి శివాలయ స్తంభాలపై భద్రాచల శ్రీసీతారామచంద్ర ఆలయ నమూనాతో స్వాగతం ద్వారం, పానగల్‌ ఆలయ స్తంభంపై భువనగిరి కోట, పానగల్‌ ఛాయ సోమేశ్వరాలయం కొలువుదీరిన స్వాగతం ద్వారం ఉన్నాయి.

తెలంగాణ శిల్పకళా వైభవాన్ని సభూతో సభవిష్యతి అన్నట్లు చాటేలా అపూర్వమైన స్వాగత తోరణాలను నగరం నలుచెరగులా ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ నెల 15 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లఓ భాగంగా హైదారాబాద్‌ మహానగారాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వినూత్నమైనరీతిలో ఆకట్టుకొని ఆహా అనిపించేలా సన్నాహాలు చేస్తున్నది. హైదరాబాద్‌ నగరానికి అన్ని దిక్కుల్లో ఎంపిక చేసిన 100 ప్రాంతాల్లో స్వాగత తోరణాలను నెలకొల్పుతున్నారు. ఒక్కో తోరణంపై ఒక్కో సాహితీవేత్త, కవి పేరు, ఫోటోతోపాటు వారి రచనావైశిష్ట్యాన్ని అభివ్యక్తంచేస్తూ  స్వాగతతోరణాలను అమర్చారు.

ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌ షో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆహార్యం తలపించేలా హెచ్‌ఎండీఏ విశేషంగా లేజర్‌షోను నిర్వహిస్తున్నది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లేజర్‌ షోను సభల చివరిరోజున దాదాపు 20-25 నిమిషాల పాటు ప్రదర్శిస్తారు. సుద్దాల అశోక్‌తేజ రాసిన అదిగో పోతన అన్న పాటతో ప్రారంభమయ్యే లేజర్‌షోలో నృత్యం కూడ కలగలిసి ఉంటుంది. పదిమంది సిబ్బంది పర్యవేక్షణలో లేజర్‌ షో కాంతులు కనువిందు చేయనున్నాయి. మహాసభల ఆరంభ. ముగింపు వేడుకల సందర్భంగా ఫైర్‌వర్క్స్‌ ముచ్చటగొలిపే విధంగా ఉండనున్నాయి. ఐదు నిమిషాలపాటు ఆకాశం నుంచి పూలవర్షం కురిసే తరహాలో ఫైర్‌ షాట్స్‌ ఉండనున్నాయి. తెలుగు మాగాణంలో అడుగుపెట్టిన దేశ, విదేశ ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకుల ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.

తెలుగు అక్షరాలను సూచించేలా ..

తెలుగు అక్షరమాలలో అ నుంచి  56 అక్షరాలను విద్యుత్‌ దీపాలతో రూపొందించి ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్‌లపై అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు అనే బోర్డులను తయారు చేసి ఎల్బీస్టేడియంతో పాటు తెలుగుతల్లి వంతెనల వ్దద ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం నగరంలో పండుగ వాతావరణం కనిపించేలా పవర్‌ క్యాన్‌ దీపాలను అన్ని పార్కులు, కూడళ్లలో ఏర్పాటు చేశారు.

మహాసభల్లో తెలంగాణ విందు

ప్రపంచ తెలుగు మహాసభల్లో హాజరయ్యేవారికి తెలంగాణ వంటకాలతో ఆతిథ్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర వాసులు ఎక్కువగా ఇష్టపడే రుచులను భోజన పట్టికలో చేర్చారు. మేక, గొర్రె కాళ్ల మాంసంతో చేసే పాయా, పచ్చిపులుసు, చింతకాయ, పచ్చిమిరప, పుంటికూర, తొక్కులు, గుడాలు, అంబలి, గటుక, సజ్జరొట్టెలు, సర్వపిండి, మురుకులు, సకినాలు తదితరాలను వడ్డించనున్నారు. వేదికల వద్దే భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకచోట వండి, అన్ని వేదికల వద్దకు వాటిని సరఫరా చేస్తారని మహాసభల వ్యూహ బృందం సభ్యుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ తెలిపారు.

ఆతిథ్యం :

అతిథులందరికీ ఏ లోటూ లేకుండా చూసేందుకు ప్రతీ అతిథికీ ఓసహాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, పరిశోధకులను అతిథులుగా గుర్తిస్తూ ఆహ్వానాలు అందజేశారు. దాదాపు  వేయిమంది వరకు అతిథులు పాల్గొనే తెలుగు మహాసభల్లో ఎవరికీ ఏ సమస్య లేకుండా చూసుకునేలా, వారి అవసరాలకు అనుగుణంగా వేదికలను తీసుకుపోయేలా ఒక వాలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తెలుగు భాష, సాహిత్యంపట్ల అవగాహన ఉన్న వారిని వాలంటీర్లుగా ఎంపిక చేయాలని సాహిత్య అకాడమీ భావించినా జీఈస్‌ విజయవంతానికి దోహదపడిన హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులో తెలుగు తెలిసిన వారిని వాలంటీర్లుగా నియమించుకోవాలని భావిస్తున్నారు.

ఆస్వాదం :

తెలుగు మహాసభల్లో రోజంతా సాహిత్య సదస్సులు, చర్చలు ఉంటాయి. సాయంత్రం వీనుల విందైన సంగీతం వింటూ, కనువిందు చేసే నాట్యాలు చూస్తూ గడపొచ్చు. ఎల్బీ స్టేడియంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఉత్తమ ప్రమాణాలతో ఓ సాంస్కవృతిక ప్రదర్శన ఉంటుందని లలిత కళాతోరణం రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలోనూ జానపద, శాస్త్రీయ సంగీత, నాట్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

కానుకలు :

ప్రతినిధులందరికీ తెలుగు వాచకాన్ని కానుకగా ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రపంచంలోని తెలుగువారందరూ ఇంట్లో తెలుగు భాషను నేర్చుకునేలా, తెలుగు సంస్కృతి గురించి తెలుసుకునేలా ఓ వాచాకాన్ని రూపొందించాలని సీఎం నిర్వాహకులను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి ప్రతినిధికీ ఓ చేనేత సంచి, అయిదు రోజుల తెలుగు మహాసభల ప్రణాళికా పత్రం, తెలుగు వాచకం, కొన్ని పుస్తకాలను అందజేయాలని కోర్‌ కమిటీ భావిస్తున్నది. అతిథులందరినీ శాలువాతో సత్కరించి, ఒక జ్ఞాపికను బహూకరిస్తారు.

బ్రిటిష్‌ లైబ్రరీలోని తెలుగు పుస్తక జాబితా

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తమవంతు భాగస్వామ్యం పంచుకొంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా లండన్‌లో స్థిరపడ్డ వరంగల్లు జిల్లా ధర్మసాగర్‌కు చెందిన చాడ సృజన్‌రెడ్డి తన మిత్రబృందంతో కలిసి ప్రఖ్యాత బ్రిటీష్‌ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలకు సంబంధించిన క్యాటలాగ్‌ (పుస్తక జాబితా)ను తెలుగు చేసే పనిలో పడ్డారు. తెలుగులో, ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో ముద్రించిన వేల పుస్తకాలను, తెలుగులో ఉనన తాళపత్ర గ్రంథాలను, ప్రాచీన సాహిత్య రచనలను గుర్తించి వాటికి సంబంధించి తెలుగులో క్యాటలాగ్‌ను తయారుచేస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలంటూ ఆహ్వానం అందడంతో పాటు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి నుంచి వచ్చిన సూచనతో ఈ బృహత్ప్రయత్నాకి  శ్రీకారం చుట్టారు. దాదాపు ఎనిమిది వేల పుస్తకాలతెలుగు క్యాటలాగ్‌  సిద్ధమైంది.

 

Tags :