Tollywood: పవన్ అసంతృప్తిపై ఇండస్ట్రీ ఏమంటోంది..?

తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేయడంపై .. ఇండస్ట్రీ స్పందిస్తోంది. ఒకొక్కరుగా ఇండస్ట్రీ పెద్దలు బయటకు వస్తున్నారు. వారి అభిప్రాయాలను వినిపిస్తున్నారు కూడా.
టాలీవుడ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అరవింద్ (Allu Aravind) స్పందించారు. ‘‘ఆ నలుగురు.. అంటూ రెండు రోజుల నుంచి వార్తలొచ్చాయి. వారి కబంధ హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్టు చిత్రీకరించారు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. ‘ఆ నలుగురు’ అనే మాట 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. తర్వాత నలుగురు.. పది మంది అయ్యారు. అది ఎవరూ పట్టించుకోలేదు’’ అని పేర్కొన్నారు.
‘‘పవన్ కల్యాణ్ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా థియేటర్లు మూసేస్తామని అనడం దుస్సాహసమే. మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోరాడుతున్న వ్యక్తి ఆయన. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు మనకు తెలిసిన వారే కదా కలుద్దాం అన్నారు. కానీ, ఛాంబర్ వాళ్లు ఎవరూ వెళ్లలేదు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలిసి వెళ్లాలి కదా. ఎవరూ వెళ్లలేదు’’ అని అన్నారు.
మరోవైపు .. ఈ అంశంపై బన్నీవాసు స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్‌గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల గొడవల్లో సినీ పరిశ్రమ నలిగిపోతోంది అనేది ఇప్పటికైనా సరే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గ్రహించాలి. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే.. మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని బన్నీ వాసు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పెద్ద సమస్యలను పరిష్కరించడపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసర సమస్యలను సృష్టించారు. ఇప్పుడవే పెద్దవయ్యాయి. కామన్ సెన్స్‌తో ఆలోచించి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కాదు.- నిర్మాత నాగవంశీ