Pawan Kalyan: మరోసారి పవన్ ఫైర్.. సినిమా ఇండస్ట్రీలో అనారోగ్య ధోరణులపై ఉక్కుపాదం..!!

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల బంద్ (theatres bundh) ప్రకటన వెనుక ఉన్న శక్తులను గుర్తించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారులను ఆదేశించారు. ఈ బంద్‌లో జనసేనకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నా వెనుకాడవద్దని స్పష్టం చేశారు. సినిమా హాళ్ల నిర్వహణలో పారదర్శకత, టికెట్ ధరల నియంత్రణ, ఆహార పదార్థాల ధరలపై పర్యవేక్షణ ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు (Kandula Durgesh) సూచించారు.
సినిమా హాళ్ల బంద్ ప్రకటనకు నేపథ్యం, దీనిలో ప్రమేయం ఉన్న వ్యక్తులు, తూర్పు గోదావరి జిల్లాలో ఈ ప్రకటన మొదట వెలువడటం వంటి అంశాలపై ఉప ముఖ్యమంత్రి చర్చించారు. థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన నాయకుడి ప్రమేయం ఉందని నిర్మాత దిల్ రాజు (Dil Raju) మీడియా ముందు ప్రకటించారు. ఒక సినీ నిర్మాతతో పాటు థియేటర్లు కలిగిన రాజకీయ నాయకుడి పేరు కూడా ఈ సందర్భంగా వినిపించింది. ఈ కోణంలో విచారణ జరిపి నిజాలను బయటకు తీసుకురావాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. బెదిరింపు ధోరణితో వ్యాపారాలు సాగించే అనారోగ్యకర వాతావరణానికి తావు లేదని హెచ్చరించారు. మరోవైపు.. థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన ఆరోపణల నేపథ్యంలో జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణను (Athi Satyanarayana) పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
కొత్త చిత్రాల విడుదల సందర్భంగా టికెట్ ధరల (ticket rates) పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (Film chamber) ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని పవన్ కల్యాణ్ సూచించారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) విషయంలోనూ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి బేధాలు పాటించవద్దని స్పష్టం చేశారు. సినిమా హాళ్ల నిర్వహణలో ప్రభుత్వ శాఖలు పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సినిమా హాళ్లలో టికెట్ ధరలతో పాటు పాప్‌కార్న్, శీతల పానీయాలు, నీటి సీసాల ధరలు అధికంగా ఉండటంపై పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధరలు, వాటి నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆహార పదార్థాల వ్యాపారంలో గుత్తాధిపత్యం సాగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో, ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంత్రి దుర్గేష్‌కు ఆదేశించారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి, పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం మెరుగవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పన్నుల శాఖతో కలిసి పరిశీలించాలని సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాళ్లకు రావాలంటే ధరలు సహేతుకంగా ఉండాలని, అధిక ధరల వల్ల వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఆయన ఉద్ఘాటించారు.
సినిమా వ్యాపారం సజావుగా సాగేందుకు ప్రోత్సాహకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలతో సమావేశమై, వారి సూచనలను స్వీకరించాలని సినిమాటోగ్రఫీ శాఖకు సూచించారు. ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్‌మెంట్ పాలసీ ద్వారా సినిమా రంగ అభివృద్ధికి సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.