RGV: రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైందా..?

రామ్ గోపాల్ వర్మకు (RGV) ఖర్మ కాలుతున్నట్టుంది. ఆయన టైం ఏమాత్రం బాగాలేదు. సినిమాల్లో కాలం అస్సలు కలసి రావట్లేదు. ఒకప్పుడు దేశాన్నే ఆశ్చర్యపరిచిన దర్శకుడు ఇప్పుడు చిల్లర సినిమాలతో కాలం గడిపేస్తున్నారు. మరోవైపు అదీ ఇదీ అని తేడా లేకుండా అన్నింటిలో వేలు పెట్టి పరువును బజారుకీడ్చుకున్నారు. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ (AP Politics) లో వైసీపీ (YCP) స్టాండ్ తీసుకుని టీడీపీ (TDP), జనసేన (Janasena) నేతలను టార్గెట్ చేయడం, వాళ్లను కించపరిచేలా పోస్టులు పెట్టడం వర్మకు చిక్కులు తెచ్చిపెట్టింది. వైసీపీ ఓడిపోవడంతో ఆయనపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. త్వరలోనే ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సోషల్ మీడియాలో (social Media) రెచ్చిపోయేవారు. తనదైన శైలిలో ఏపీ పాలిటిక్స్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది వ్యంగ్యానికే పరిమితమైతే బాగుండేది. కానీ అందులో వ్యక్తిగత హననానికి పాల్పడేలా ఉందంటే పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. ఈ కేసును కొట్టేయాలంటూ వర్మ కోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు కోర్టు నిరాకరించడంతో విచారణకు హాజరు కాక తప్పలేదు. పలుమార్లు వాయిదా వేసిన తర్వాత వర్మ చివరకు విచారణకు హాజరయ్యారు. కానీ ఆయన పెద్దగా సహకరించలేదని సమాచారం.
వర్మ విచారణకు హాజరైన సందర్భంగా ఏపీ సీఐడీ (CID) అధికారులు మరో కేసులో వర్మను విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. గతంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు (Kamma Rajyamlo Kadapa Redlu) అని వర్మ ఓ సినిమా తీశారు. ఇది ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ కోర్టును ఆశ్రయించడంతో పేరు మార్చాల్సి వచ్చింది. అయినా యూట్యూబ్లో వర్మ అదే పేరుతో సినిమా విడుదల చేశారు. దీనిపై కొందరు టీడీపీ (TDP) కార్యకర్తలు సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సీఐడీ ఇవాళ విచారణకు రావాలని వర్మను కోరింది. కానీ వర్మ విచారణకు హాజరు కాలేదు. తాను సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నందున రెండు నెలల పాటు వెసులు బాటు ఇవ్వాలంటూ లాయర్ ద్వారా వర్తమానం పంపించారు.
అయితే ఈ కేసులో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. రేపో మాపో మరోదఫా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనుంది. అప్పుడు కూడా వర్మ విచారణకు హాజరు కాకపోతే ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా కేసులో వర్మకు కోర్టు అరెస్టు కాకుండా వెసులు బాటు ఇచ్చింది. కానీ ఈ కేసులో వర్మ కోర్టును ఆశ్రయించలేదు. మరోవైపు వర్మ కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం తాత్సారం ప్రదర్శిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి సీఐడీ అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.