Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం వెంపర్లాట.. సినిమా వాళ్లపై విమర్శల వెల్లువ

భారత్-పాకిస్తాన్ (Indo Pak War) మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో (Pahalgam) ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) దాడులు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడులు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి. సరిహద్దుల్లో కాల్పులు, విమానాశ్రయాల మూసివేత, అంతర్జాతీయ సమాజం నుంచి సంయమనం పాటించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సున్నితమైన సమయంలో సినిమా పరిశ్రమలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరును టైటిల్‌గా రిజిస్టర్ (Title Registration) చేసుకునేందుకు నిర్మాతలు, ముఖ్యంగా రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) చెందిన జియో స్టూడియోస్ (Jio Studios) పోటీపడటం తీవ్ర వివాదానికి దారితీసింది.
పహల్గాం దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గౌరవంగా, సిందూరం యొక్క సాంస్కృతిక పవిత్రతను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరును పాకిస్తాన్ పై ఆపరేషన్ కు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పేరు దేశవ్యాప్తంగా భావోద్వేగాన్ని రేకెత్తించింది. కానీ సినిమా నిర్మాతలు దీనిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారు. రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో స్టూడియోస్, ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలో మే 7న ఈ పేరును ట్రేడ్‌మార్క్ చేసేందుకు మొదటి దరఖాస్తు సమర్పించింది. దీంతో పాటు ముంబై నివాసి ముఖేశ్ చేత్రం అగర్వాల్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి కమల్ సింగ్ ఒబెరాయ్, ఢిల్లీకి చెందిన న్యాయవాది అలోక్ కొఠారీ కూడా ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేశారు.
టైటిల్ కోసం పోటీ పడడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. “సైనికులు ప్రాణాలు పణంగా పెడుతుంటే, ఈ పేరును వ్యాపారం కోసం వాడుకోవడం సిగ్గుచేటు,” అని కొందరు ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అనిరుద్ధ శర్మ, అంబానీ ఈ టైటిల్‌ను వ్యాపార లాభాల కోసం రిజిస్టర్ చేయడాన్ని ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు ఈ చర్యను దేశభక్తిని సొమ్ము ప్రయత్నంగా అభివర్ణించారు. బాధిత కుటుంబాల త్యాగాలను తక్కువ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ విమర్శల నేపథ్యంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ మే 8న తమ ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఆపరేషన్ సిందూర్ అనేది భారతీయ వీరత్వానికి చిహ్నం, దానిని ట్రేడ్‌మార్క్ చేసే ఉద్దేశం మాకు లేదు. జియో స్టూడియోస్‌లో ఒక జూనియర్ ఉద్యోగి అనుమతి లేకుండా ఈ దరఖాస్తు సమర్పించాడు అని రిలయెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖేశ్ అంబానీ స్వయంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించారు. భారత సైన్యం చూపిస్తున్న పరాక్రమాన్ని గర్విస్తున్నాం. దేశ సమైక్యతను కాపాడే ఏ చర్యకైనా రిలయెన్స్ మద్దతు ఇస్తుంది అని వ్యాఖ్యానించారు.
సినిమా నిర్మాతలు ఈ ఆపరేషన్‌పై సినిమా తీయడం ద్వారా దేశభక్తిని ప్రోత్సహించవచ్చని వాదిస్తున్నారు. అయితే, విమర్శకులు దీనిని కేవలం బాక్సాఫీస్ లాభాల కోసం చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. సినిమా తీస్తే, అది బాధితులకు న్యాయం చేయాలి, వాణిజ్య లక్ష్యాల కోసం కాదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (IFTPC)కు ‘ఆపరేషన్ సిందూర్’ లేదా దానికి సమానమైన టైటిల్స్ కోసం 30కి పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం.