Athi Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్‌ల బంద్ (theatres bundh) పిలుపు వివాదం కొత్త మలుపు తీసుకుంది. జనసేన (Janasena) పార్టీ నాయకుడు అత్తి సత్యనారాయణ (Athi Satyanarayana).. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో (Dil Raju) పాటు ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి, దగ్గుబాటి సురేష్ బాబు, సునీల్ నారంగ్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నలుగురూ థియేటర్‌ల బంద్ వెనుక కుట్రదారులని, తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేందుకు దిల్ రాజు నీచమైన ఆరోపణలు చేశారని అత్తి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) రిలీజ్ సమయంలో థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడంతో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది.
థియేటర్ల బంద్ కు జనసేన నేత అత్తి సత్యనారాయణ కారణమంటూ దిల్ రాజు చెప్పడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ. థియేటర్‌ల బంద్ కు ఎవరు పిలుపు ఇచ్చినా ఉపేక్షించేది లేదంటూ ఆయనపై చర్యలు తీసకుంది. అయితే అత్తి సత్యనారాయణ ఈ ఆరోపణలను ఖండించారు. థియేటర్‌ల బంద్ పిలుపు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి నుంచి వచ్చిందని, తనపై అసత్య ఆరోపణలు చేసి దిల్ రాజు తన సోదరుడిని కాపాడుకునేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. దిల్ రాజు కమల్ హాసన్‌ను మించి ఆస్కార్ రేంజ్‌లో నటించారని ఆయన అన్నారు. ఇది దురుద్దేశపూరిత కుట్ర అని అత్తి సత్యనారాయణ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్‌లు ఈ బంద్ వెనుక ఉన్నారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు. ఈ వ్యవహారం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్తి సత్యనారాయణ తన రాజకీయ భవిష్యత్తుపై దెబ్బపడిందని, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కోర్టుకు వెళతానని ప్రకటించారు. నా పార్టీ నాకు అగ్నిపరీక్ష పెట్టింది. కానీ నేను పవన్ కళ్యాణ్‌తోనే ఉంటాను. ఈ కుట్రను పార్టీకి వివరిస్తాను అని ఆయన తెలిపారు. “పవన్ కళ్యాణ్ నా దేవుడు. ఆయన సినిమాను నేనెందుకు ఆపుతాను?” అని అత్తి సత్యనారాయణ ప్రశ్నించారు. రాజమండ్రి జనసేన కార్యకర్తలు తనకు ఈ పరిస్థితిలో అండగా ఉన్నారని, వారు తన బాధను అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.
అత్తి సత్యనారాయణ ఈ వ్యవహారంలో తనను అర్థం చేసుకోవాలని జనసేన పార్టీని కోరారు. “ఇది సినిమా వ్యవహారం. నా ఉద్దేశం పవన్ కళ్యాణ్‌ను లేదా ఆయన సినిమాను ఆపడం కాదు. నా పై వచ్చిన ఆరోపణలు అసత్యమని పార్టీకి వివరిస్తాను” అని ఆయన అన్నారు. మరి దిల్ రాజు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు, ఈ వివాదం ఎలాంటి రాజకీయ, సినీ పరిణామాలకు దారితీస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.