Theatres Bandh: థియేటర్ల బంద్‌పై వెనక్కు తగ్గిన ఎగ్జిబిటర్లు..! హరిహర వీరమల్లు సేఫ్..!!

తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల (cinema theatres) బంద్‌కు సంబంధించిన వివాదం కొత్త మలుపు తిరిగింది. జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh), తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్‌ల (Damodara Prasad) వ్యాఖ్యలు ఈ అంశంపై కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా రిలీజ్ సమయంతో ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే ప్రస్తుతానికి బంద్ లేదని ఎగ్జిబిటర్లు ప్రకటించడంతో వివాదం ముగిసింది.
సినిమా అద్దె (rented) విధానంపై అభ్యంతరం చెప్తూ.. జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు గతంలో నిర్ణయించారు. అద్దె ప్రాతిపదిక కాకుండా, షేర్ (percentage) పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే అమలవుతున్నందున, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా ఇదే విధానం వర్తింపజేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబట్టారు. ఈ డిమాండ్‌కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం జూన్‌లో విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’, ‘థగ్ లైఫ్’, ‘కన్నప్ప’, ‘కుబేర’ వంటి పెద్ద సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఎగ్జిబిటర్ల నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. థియేటర్ల బంద్ నిర్ణయం సరైంది కాదని, ముఖ్యంగా ‘హరిహర వీరమల్లు’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం రిలీజ్ సమయంలో ఇలాంటి ఇబ్బందులు సృష్టించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. “సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంది. సినిమా రేట్ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. త్వరలో సినిమా రంగానికి సంబంధించి కొత్త పాలసీని తీసుకురాబోతున్నాం” అని దుర్గేష్ ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక కొంతమంది సినీ పెద్దలు ఉన్నారనే ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన హోం శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో థియేటర్ల మూసివేత వల్ల సినిమాలకు, రాష్ట్ర ట్యాక్స్ రెవెన్యూకి ఎంత నష్టం వాటిల్లుతుందో కూడా అంచనా వేయనున్నారు.
ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారుతుండడంతో హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్ .. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపింది. ఈ సమావేశంలో దిల్ రాజు, సునీల్ నారంగ్, సి. అశ్వనీదత్, అల్లు అరవింద్, ఏఎం రత్నం వంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేయాలని నిర్మాతలు ఎగ్జిబిటర్లను కోరగా, ఈ ప్రతిపాదనకు వాళ్లు అంగీకరించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ఈ విషయం వెల్లడించారు. “జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత అనేది లేదు. చిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగుతాయి. మా సమస్యలను మేమే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం. ఈ నెల 30న ఈ సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం” అని వివరించారు.
జూన్ నెలలో ‘హరిహర వీరమల్లు’తో పాటు పలు పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో థియేటర్ల బంద్ నిర్ణయం సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరించారు. గతంలో కూడా ఇలాంటి బంద్‌లు, షూటింగ్‌ల నిలిపివేతలు జరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని ఫిలిం ఛాంబర్ సభ్యులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, థియేటర్లను నడుపుతూనే పరిష్కార మార్గాలను అన్వేషించాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ సమస్యలను పరిష్కరించేందుకు మే 30న కమిటీ ఏర్పాటు చేయనుంది.