విస్తరిస్తున్న భాగ్యనగరం.. కొత్త సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

విస్తరిస్తున్న భాగ్యనగరం.. కొత్త సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

హైదరాబాద్‌ అంటే ఉప్పల్‌ నుంచి పటాన్‌ చెరు, కొంపల్లి టు రాజేంద్రనగర్‌, అలాగే ఓల్ట్‌ సిటీ అని సింపుల్‌గా చెప్పేయొచ్చు. ఇప్పుడు అంతకు మించి సిటీ విస్తరిస్తోంది. నగరం నలువైపులా కొత్త నగరాలు వస్తున్నాయి. ఏకంగా ప్రభుత్వమే ఈ కొత్త నగరాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించేందుకు నగర పొలిమేరల్లో కొత్త సిటీలను నిర్మిస్తోంది. ఓల్డ్‌సిటీ, న్యూసిటీ, హైటెక్‌సిటీతో పేరుగాంచిన హైదరాబాద్‌లో త్వరలో గ్రీన్‌సిటీ కూడా చోటు దక్కించుకోనుంది. జంటనగరాల దాహార్తి తీర్చిన హిమాయత్‌సాగర్‌, గండిపేట జంట జలాశయాల పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వం ఇచ్చిన 111 జీవోను కేసీఆర్‌ ప్రభుత్వం ఎత్తివేయడంతో ఆ ప్రాంతాల్లో మరో సిటీ ఏర్పాటు కానున్నది. 

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల భూములు ఈ జీవో ఎత్తివేతతో బంగారుమయం కానున్నాయి. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిధిలోని 84 గ్రామాల్లో జీవో 111 ఆంక్షలను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి కీలకం కానున్నది. ఈ జీవో ఆంక్షల కారణంగా హైదరాబాద్‌ చుట్టూ పక్కల ఉన్న ఈ 84 గ్రామాలు ప్రస్తుతం 120 గ్రామాలుగా రూపాంతరం చెందాయి. అయితే ఈ ప్రాంతాలు జీవో 111 కారణంగా అభివృద్ధికి అమడ దూరంలో నిలిచి పోయాయి. తాజాగా ప్రభుత్వం జీవోను ఎత్తివేయ డంతో పాటు ఆంక్షలను తొలిగిస్తూ  ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ప్రాంత భూములకు మహర్దశ పట్టనున్నది. ఆయా భూముల ధరలు రెండు, మూడు రెట్లు పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని భూములే కాకుండా పరిసరాలు కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు విస్తృతం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 111 జీవో పరిధిలోని ప్రాంతాలు ఐటీ కారిడార్‌ను ఆనుకొనే ఉండడంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కోకాపేట, వట్టినాగులపల్లి నుంచి మొదలై ఔటర్‌ మీదుగా శంషాబాద్‌ వరకు ఉన్న ప్రాంతమంతా ఐటీ కంపెనీ లకు, నివాస ప్రాంతాలకు అత్యంత అనుకూలం. ఐటీ కంపెనీల ఏర్పాటు వల్ల కాలుష్యం తక్కువగా ఉండడం, వాక్‌ టు వర్క్‌ కాన్సెప్ట్‌తో ఐటీ కారిడార్‌ పరిధి శంషాబాద్‌ వరకు విస్తరించనుంది. దీనికనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి అమలు చేయనుంది.

ఈ రెండు జిల్లాల పరిధిలోని 120 గ్రామాల ప్రజలు, అభివృద్ధికి సుదూరంలో 1.32 లక్షల ఎకరాల భూములున్నాయి. హైదరాబాద్‌ జిల్లా విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు కాగా, జీవో 111 పరిధిలో 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ఇప్పుడు ఈ భూములన్నీ ఇతర అవసరాలకు వినియోగంలోకి రానున్నది. తద్వారా ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధికి ఆనవాలుగా నిలువనుంది. ఐటీ, పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంది. హైదరాబాద్‌కు సమీపంలో, ఔటర్‌కు అత్యంత దగ్గర ఉండడంతో ఈ భూముల్లో అనేక పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీస్‌ పెరగనున్నాయి. కొత్త కంపెనీలకు భూ కేటాయింపులతో పాటు అంతర్జాతీయ మల్టి నేషనల్‌ ఐటీ కంపెనీలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 5వేలు ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి.ప్రస్తుతం 84 గ్రామాల్లో 30వేల ఎకరాలకు పైగా భూములకు ఆంక్షల ఎత్తివేతతో ఐటీ రంగం విస్తరించే అవకాశముంది. ఐటీ హబ్‌గా పేరున్న గచ్చిబౌలి ఈ ప్రాంతానికి చేరువగా ఉంది. జీవో ఎత్తివేతతో చేవెళ్ల, శంకర్‌పల్లి, కొత్తూరు వరకు ఐటీ పరిధి విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 

Tags :