తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు పెరిగిన ఆదాయం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం బాగా కళకళలాడుతోంది. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. గతంలో ప్రభుత్వానికి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి రూ.2,707.18 కోట్లు కాగా, ఇప్పుడు అభివృద్ధి పథాన ఉన్న తెలంగాణ రాష్ట్రం వల్ల ఈ ఆదాయం ఊహించనంతగా పెరిగింది. ఈ ఏడాది ఇంకా నెలన్నర రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ శాఖ ద్వారా రూ.12,624 కోట్ల రాబడి సమకూరడం విశేషం. ఇక ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అంటే మొత్తంగా ఈ రంగంలో రూ.17,600 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వం అనుసరించిన విధానాలు, సరళీకరణ పద్దతులు, అవినీతిరహిత విధానాలతో సాఫల్యమైనట్లుగా రుజువవుతోంది.
కాగా ఈ లెక్క ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ వరకే కాగా, రానున్న 40రోజుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.1200 కోట్లు, వ్యవసాయ రిజిస్ట్రేషన్లతో రూ.800 కోట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది సరికొత్త రికార్డు నమోదు కానున్నది. 2015-16లో రూ.3,370 కోట్లు ఖజానాకు చేరగా, 2016-17లో రూ.3,560 కోట్లు, 2017-18లో రూ.4,571 కోట్లు, 2018-19లో రూ.6,612 కోట్లు, 2019-20లో రూ.7,061 కోట్లు, 2020-21లో రూ.5,260 కోట్లు, 2021-22లో రూ.12,365 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇంకా 40 రోజులు మిగిలి ఉండగానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లతో రూ.12,624 కోట్లు, వ్యవసాయ రిజిస్ట్రేషన్లతో మరో రూ.5 వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ఈ ఏడాది వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రూపంలో 17.16లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ధరణి పోర్టల్‌కు 10.54 కోట్ల హిట్లతో ఇప్పటివరకు 30కోట్ల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2014-15లో భూ లావాదేవీలు 8.26లక్షల డాక్యుమెంట్లతో నమోదు కాగా, తాజాగా గతేడాది 19.88లక్షలకు చేరుకున్నాయి. ఆదాయం నాలుగు రెట్లుకు, డాక్యుమెంట్లు మూడిరతలకు పెరిగాయి.
అత్యధికంగా హైదరాబాద్ చుట్టే రియల్ వ్యాపారం జోరందుకుంటోంది. ఎక్కువ క్రయవిక్రయాల జాబితాలో మొదటి స్థానంలో రంగారెడ్డి, ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరీ, హైదరాబాద్ ఉండగా అత్యల్పంగా రాబడి నమోదవుతున్న జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం అసిఫాబాద్, ములుగు జిల్లాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి తీరును గమనిస్తున్న పెట్టుబడిదారులతోపాటు సాధారణ ప్రజలు తమ పెట్టుబడులను స్థిరాస్తి రంగంవైపు మళ్లిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేళ్లూనుకుంటున్న అన్ని రంగాల అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పురపాలికలు వంటి ప్రత్యక్ష చర్యలు, ఇతర పరోక్ష కారణాలు కూడా భూములపై పెట్టుబడులకు మార్గమవుతోంది.
స్థూల ఆర్ధిక వృద్ధిలో అపూర్వ ప్రగతి దిశగా అడుగులు వేస్తోన్న తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు కీలక స్థానం ఉంది. ఏటేటా రూ.4 వేల కోట్లకుపైగా రాబడినిస్తున్న ఈ శాఖ ప్రజల్లో దాదాపు ఏడాదికి రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ను చేతులు మార్చేలా చూస్తోంది. ఇ-చలాన్ మాడ్యూల్, సొంత నెట్‌వర్క్‌తో సర్వర్ ఆధునీకరణ, మెరుగైన సేవలు, ఆధునిక సాంకేతికత, వీడియో రికార్డింగ్, ఆన్‌లైన స్లాట్ బుకింగ్, ఇంటివద్దే సేవలు, పోస్టాఫీసుల్లో స్టాంపుల విక్రయాలు, ఆధార్ అనుసంధానం వంటి అత్యున్నత సేవలను అందిస్తూ పారదర్శకత, అవినీతిరహిత విధానాలను అవలంభిస్తోంది.